Dailyhunt
Jitesh Sharma:  "ఇంకా పిల్లాడే".. వైభవ్‌ను 'అన్‌ప్రొఫెషనల్' అనడం వెనుక ఉన్న అసలు గుట్టు విప్పిన జితేష్

Jitesh Sharma: "ఇంకా పిల్లాడే".. వైభవ్‌ను 'అన్‌ప్రొఫెషనల్' అనడం వెనుక ఉన్న అసలు గుట్టు విప్పిన జితేష్

NTV Telugu 1 week ago

Jitesh Sharma: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్ జితేష్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి చేసిన “అన్‌ప్రొఫెషనల్” అనే వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది.

అయితే, ఈ మాట వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని జితేష్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వివరించి, వివాదానికి తెరదించాడు. 15 ఏళ్ల వైభవ్ ఇంకా చిన్న పిల్లాడేనని, ఆ వయసులో ఉండాల్సిన అల్లరి, ఇష్టాలను గౌరవించాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశాడు. లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో “భవిష్యత్తులో భారత స్టార్‌గా ఎదిగే కుర్రాడు ఎవరు?” అని అడిగినప్పుడు, జితేష్ తడుముకోకుండా వైభవ్ పేరు చెప్పాడు. వైభవ్‌లో ఉన్న అద్భుతమైన టెక్నిక్, గట్టి మానసిక స్థితి, కఠోర శ్రమ అతడిని మూడు ఫార్మాట్లలోనూ మేటి ఆటగాడిగా మారుస్తాయని జితేష్ కొనియాడాడు. మైదానంలో ఎంతో పరిణతితో, ప్రొఫెషనల్‌గా కనిపించే వైభవ్.. బయట మాత్రం పూర్తి భిన్నమని జితేష్ చెప్పుకొచ్చాడు.

వైభవ్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ.. “అతను నాకు తమ్ముడి లాంటివాడు. మా ఇంటికి వస్తుంటాడు, నా భార్యతో సరదాగా మాట్లాడతాడు. 15 ఏళ్ల పిల్లాడికి ఐస్‌క్రీమ్ అంటే ఇష్టం ఉండదా? వాడు నా రూమ్‌కు వచ్చి ఐస్‌క్రీమ్ తింటాడు, కార్టూన్లు చూస్తాడు. వాడు నా దగ్గర ఉన్నప్పుడు చాలా స్వేచ్ఛగా ఉంటాడు. బయట ప్రపంచం అతడి నుంచి ఎంతో వృత్తి నైపుణ్యాన్ని (Professionalism) కోరుకోవచ్చు, కానీ నా దగ్గర మాత్రం వాడు పిల్లాడిలాగే ఉండాలని నేను కోరుకుంటాను. అందుకే వయసుకి తగినట్లుగా ఎంజాయ్ చేయమని, కేవలం బ్యాటింగ్ మీద దృష్టి పెట్టమని చెబుతుంటాను” అని జితేష్ వివరించాడు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను తాను పట్టించుకోనని, ఆ చిన్నారి తన బాల్యాన్ని కోల్పోకూడదన్నదే తన ఆకాంక్షని జితేష్ శర్మ మనసులో మాట చెప్పాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu