Dailyhunt
Jowar Ambali Recipe: ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే హెల్తీ, టేస్టీ డ్రింక్.. పాత పద్దతిలో జొన్న అంబలి..

Jowar Ambali Recipe: ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే హెల్తీ, టేస్టీ డ్రింక్.. పాత పద్దతిలో జొన్న అంబలి..

NTV Telugu 5 days ago

Jowar Ambali Recipe: జొన్నలు ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తాయి. అమ్మమ్మలు తాతయ్యల నాటి కాలం నుంచి జొన్నలు పల్లెల్లో తింటూ వస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవన పరిణామాల మధ్య ఏదైనా జబ్బులు వస్తేనే జొన్నలు తినడం అలవాటు చేసుకుంటున్నారు.

అయితే.. వేసవిలో జొన్నలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. వీటి వల్ల శరీరానికి అద్భుతమైన చల్లదనం లభిస్తుంది. ముఖ్యంగా జొన్న జావ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఇవి ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి జొన్న జావ లేదా అంబలి చాలా మంచిది. ఇది శరీరంలో అధిక వేడిని తగ్గించి, హాయిని ఇస్తుంది. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఇచ్చే జొన్న అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

READ MORE: YS Jagan Padayatra: వచ్చే సంవత్సరం నా పాదయాత్ర.. ఇక, చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపిస్తాం..!

కావలసిన పదార్థాలు:
జొన్న పిండి: 1 కప్పు
పెరుగు (పులియబెట్టడానికి): 1 టేబుల్ స్పూన్
నీళ్లు: 2 కప్పులు (అవసరానికి తగినట్లుగా మరికొన్ని)
ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం:
ఒక పాత్రలో ఒక కప్పు జొన్న పిండిని తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక కప్పు నీళ్లు పోయాలి. ఉండలు లేకుండా బాగా కలిపి, రాత్రంతా పక్కన పెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల పిండి పులిసి, అంబలికి మంచి రుచి, పోషక విలువలు వస్తాయి. మరుసటి రోజు ఉదయం చూస్తే, పిండి కిందకు చేరి పైన నీళ్లు పేరుకుని ఉంటాయి. ఆ పై నీటిని జాగ్రత్తగా ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించాలి. అవసరమైతే మరో కప్పు నీటిని కూడా జోడించవచ్చు. నీళ్లు మరుగుతున్నప్పుడు, అడుగున ఉన్న జొన్న పిండి మిశ్రమాన్ని అందులో పోసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. తగినంత ఉప్పు వేసి, సుమారు 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించాలి. అడుగు అంటకుండా గరిటెతో తిప్పుతూ ఉండటం ముఖ్యం. అంబలి మరీ చిక్కగా అనిపిస్తే, కొద్దిగా నీళ్లు పోసి సూప్ మాదిరిగా పలచగా వచ్చేలా చూసుకోవాలి. వేడివేడి జొన్న అంబలిని ఒక గ్లాసులోకి తీసుకుని, పైన ఒక స్పూన్ గడ్డ పెరుగు వేసుకుని తాగితే ఆ రుచే వేరు!.. మీరూ తప్పక ట్రై చేయండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu