Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?

Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?

NTV Telugu 1 week ago

కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక పూర్తైంది. తీవ్ర లాబీయింగ్‌, అంతర్గత ఒత్తిడులకు కాంగ్రెస్ హైకమాండ్ తలొగ్గింది.

సుదీర్ఘ చర్చలు.. తర్జనభర్జన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయించింది. సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడానికి అధిష్టానానికి తల ప్రాణం తోకకి వచ్చింది. మొత్తానికి వీడీ.సతీశన్‌ను కేరళం ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసి గందరగోళాన్ని చల్లారపరిచింది.

అలా కేరళం పంచాయితీ ముగిసిందో లేదో.. ఇప్పుడు పొరుగున ఉన్న కర్ణాటక వంతు వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మధ్య ఎప్పటి నుంచో సీఎం పంచాయితీ నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవిపై డీకే.శివకుమార్ ఆశలు పెట్టుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినందుకు సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అధిష్టానం మాత్రం సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. కానీ డీకే.శివకుమార్‌లో మాత్రం ఆశలు చచ్చిపోలేదు. గతేడాది నుంచి ఇరు వర్గాల మధ్య పంచాయితీ నడుస్తోంది. హస్తిన వేదికగా ఎన్నో చర్చలు జరిగాయి. తర్వాత బెంగళూరు వేదికగా బ్రేక్‌ఫాస్ట్‌లు కూడా జరిగాయి. కానీ పంచాయితీ మాత్రం తెగలేదు. కానీ కొంత కాలంగా స్తబ్దతగా ఉన్నప్పటికీ మే 15న డీకే.శివకుమార్ బర్త్‌డే సందర్భంగా బెంగళూరులో కటౌట్లు వెలిశాయి. ''కాబోయే ముఖ్యమంత్రి'', ''నెక్ట్స్ సీఎం'' అంటూ ప్లెక్సీలు వెలిశాయి. దీంతో మరోసారి ముఖ్యమంత్రి అంశం తెరపైకి వచ్చింది.

అంతేకాకుండా ఇటీవల కేరళం పంచాయితీని అధిష్టానం చాకచక్యంగా పరిష్కరించడంతో ఇప్పుడు డీకే.శివకుమార్ వర్గీయులు ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. ఈ ప్రభుత్వ కాలంలోనే డీకే.శివకుమార్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో మరోసారి హైకమాండ్‌కు కొత్త తలనొప్పి మొదలు కాబోతుందని అర్థమవుతోంది.

తాజాగా సిద్ధరామయ్య తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ఖాళీ మంత్రి పదవుల భర్తీపై దృష్టి పెట్టారు.. డీకే శివకుమార్ మాత్రం ప్రస్తుత పదవీకాలంలోనే ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు మొదలయ్యాయి. అయితే కేబినెట్ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జరిగితే డీకే శివకుమార్ సీఎం ఆశలకు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ముఖ్యంగా సిద్ధరామయ్య ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై తన పట్టు మరింత బలపరుచుకుంటే నాయకత్వ మార్పు అవకాశాలు తగ్గవచ్చని భావిస్తున్నారు.

రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయ పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ నిశితంగా గమనించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం స్థిరంగా కొనసాగడం, పార్టీ అంతర్గత విభేదాలు బయటపడకుండా చూడడం ఇప్పుడు హైకమాండ్‌కు పెద్ద సవాల్‌గా మారింది.

అయితే రెండు వర్గాలు ఒత్తిడి పెంచుతుండటం, బహిరంగ రాజకీయ సంకేతాలు ఎక్కువవుతుండటంతో ఇక ఎక్కువకాలం నిర్ణయం వాయిదా వేయడం కష్టమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సిద్ధరామయ్యకు మద్దతుగా కొనసాగాలా? లేక డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలా? అనే అంశంపై కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఒక వర్గం నుంచి తీవ్ర అసంతృప్తి తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏం జరగబోతుందా? వేచి చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu