Kerala Chief Minister: కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా కేసీ వేణుగోపాల్ పేరు దాదాఫుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఈయన వైపే ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
కేరళ సీఎం అభ్యర్థి, ప్రభుత్వం ఏర్పాటును పరిశీలిస్తున్న పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్‌లు తమ నివేదికను పార్టీ చీఫ్ మల్లికార్జన ఖర్గేకు సమర్పించారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజల అభిప్రాయాల ప్రకారం పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుందని వాస్నిక్, మాకెన్‌లు చెప్పారు.
కేరళ సీఎం రేసులో కేసీ వేణుగోపాల్‌తో పాటు వీడీ సతీషన్, రమేష్ చెన్నితాల వంటి వారు కూడా ఉన్నారు. అయితే, కేసీకే అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. 63 ఏళ్ల వేణుగోపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, అలాగే అలప్పుజ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఒకవేళ కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా నియమితులైతే ఆయన ఈ సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి అధికారంలోకి రావడానికి నిజమైన సూత్రధారి కేసీ వేణుగోపాల్ అంటూ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. కొత్త సీఎం ప్రమాణస్వీకారం సోమవారం జరిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. 140 సీట్లు ఉన్న కేరళలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 102 సీట్లను గెలుచుకున్నాయి. ఇందులో కాంగ్రెస్ 63, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ 22, కేరళ కాంగ్రెస్ 07 సీట్లను గెలుచుకున్నాయి.

