Dailyhunt
KL Rahul: 'నన్ను టెస్ట్ ప్లేయర్‌ అన్నారు.. టీ20 ఆడటం రాదన్నారు'.. కేఎల్ రాహుల్ భావోద్వేగం..

KL Rahul: 'నన్ను టెస్ట్ ప్లేయర్‌ అన్నారు.. టీ20 ఆడటం రాదన్నారు'.. కేఎల్ రాహుల్ భావోద్వేగం..

NTV Telugu 1 week ago

ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో క్లాసిక్ బ్యాటింగ్‌కు నిలువుటద్దం కేఎల్ రాహుల్. కర్ణాటకకు చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్, తన కెరీర్ ఆరంభంలో సాంప్రదాయ టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పనికొస్తాడని విమర్శలు ఎదుర్కొన్నాడు.

కానీ. పట్టుదలతో తన శైలిని మార్చుకుని మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. ముఖ్యంగా ఐపీఎల్ వంటి వేదికలపై భారీ స్కోర్లతో పాటు వేగంగా పరుగులు సాధిస్తూ విమర్శకుల నోళ్లు మూయించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న రాహుల్, క్రీజులో ఉంటే ఆ ఫీల్డర్లకు పని చెప్పడం ఖాయం. మైదానంలో చురుకుగా ఉంటూ భారీ సిక్సర్లతో విరుచుకుపడటం అతని ప్రత్యేకత. గత పదేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన రాహుల్, ఇప్పుడు మరింత పరిణతి చెందిన ఆటగాడిగా కనిపిస్తున్నాడు.

అయితే తాజాగా ‘జియోస్టార్’ టాక్ షోలో పాల్గొన్న రాహుల్.. తన అంతరంగంలోని భావాలను పంచుకున్నాడు. తనపై ఉన్న “టెస్ట్ స్పెషలిస్ట్” అనే ముద్రను చెరిపివేసి, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిరూపించుకోవడం పట్ల గర్వంగా ఉందని తెలిపాడు. టెస్ట్ క్రికెట్ కు మాత్రమే నువ్వు ఆడగలవు.. టీ20 క్రికెట్ కు పనికి రావు అని చాలా మంది అంటుంటే ఎంతో బాధపడ్డట్లు చెప్పుకొచ్చాడు. పదేళ్ల క్రితం టీ20 జట్టులో చోటు దక్కించుకోవడం తనకు కలగా ఉండేదని, కానీ నిరంతర శ్రమతో ఆ అడ్డంకులను అధిగమించానని చెప్పాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 64 బంతుల్లోనే 152 పరుగులు చేసిన అద్భుత ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ.. ఫలితం అనుకూలంగా రాకపోయినా తన ఆటతీరుపై తనకు సంతృప్తి ఉందన్నాడు.

అంతేకాకుండా.. తండ్రిగా మారిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి రాహుల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గతేడాది కుమార్తె పుట్టిన తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని తెలిపాడు. “కుమార్తె కౌగిలింత, ఆమె చిరునవ్వు నా బాధలను మరిపిస్తాయి. తండ్రిగా మారడం నా క్రికెట్ పట్ల నా దృక్పథాన్ని మార్చింది. ఇప్పుడు నేను ఆటను అతిగా ఆలోచించడం లేదు. కేవలం ఆ 4-5 గంటలు మైదానంలో ఉత్సాహంగా ఆడుతున్నాను” అని చెప్పుకొచ్చాడు.

34 ఏళ్ల వయసులో ఉన్న రాహుల్, తనకింకా కెరీర్ మిగిలే ఉందని, రాబోయే రోజుల్లో దేశానికి, తన టీమ్‌కు మరిన్ని ట్రోఫీలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. ఆటలో తప్పులు సహజమని, కానీ వాటి నుంచి నేర్చుకుని ముందడుగు వేయడమే అసలైన క్రీడా స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో 185.84 సగటుతో 433 పరుగులు చేసి సెకండ్ లీడింగ్ స్కోరర్‌గా రాహుల్ కొనసాగుతున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu