Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

NTV Telugu 1 week ago

KTR : పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి కుమారుడు బండి భగీరథ్ ఉదంతంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తక్షణమే కేంద్రమంత్రిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ నిరంతరం “బేటీ బచావో.. బేటీ పడావో” అని చెప్తుంటారని, అయితే అవి కేవలం నినాదాలకే పరిమితమైతే దేశంలోని ఆడబిడ్డలకు న్యాయం జరగదని హితవు పలికారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక కేంద్రమంత్రి కొడుకుపై లుకౌట్ నోటీసులు జారీ చేసే పరిస్థితి రావడం దేశానికే సిగ్గుచేటన్నారు. తప్పు చేసిన కొడుకును కేంద్రమంత్రి తొమ్మిది రోజుల పాటు దాచిపెట్టారని, అలాంటి వ్యక్తి పదవిలో కొనసాగడం తెలంగాణకే కాదు, దేశానికే అవమానకరమని కేటీఆర్ ధ్వజమెత్తారు.

కేంద్రమంత్రి కొడుకు ఒక మైనర్ బాలికకు అన్యాయం చేస్తే, సదరు కేంద్రమంత్రి స్వయంగా రంగంలోకి దిగి ఆ బాలిక తల్లిదండ్రులను పిలిపించి, బెదిరింపులకు గురిచేస్తూ భయభ్రాంతులకు గురిచేశారని కేటీఆర్ ఆరోపించారు. ఇంత తీవ్రమైన కేసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి ఇద్దరూ కలిసి నీరుగార్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఈ కేసును ‘హనీ ట్రాప్’ అంటూ ప్రచారం చేస్తూ, మీడియాను సైతం ‘మనీ ట్రాప్’ లో పడేసి వార్తలు బయటకు రాకుండా ఇద్దరు నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కేంద్రమంత్రిని పదవి నుంచి తొలగించకపోతే విచారణ సజావుగా సాగదని, భవిష్యత్తులో తమపై అఘాయిత్యాలు జరిగితే ముందుకు వచ్చే ధైర్యం ఏ ఆడబిడ్డ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి ఎన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడినా, ఒత్తిళ్లు తెచ్చినా వెనకడుగు వేయకుండా నిలబడిన బాధిత బాలిక తల్లిదండ్రుల ధైర్యాన్ని కేటీఆర్ అభినందించారు. ఈ కేసులో బాలిక తరపున గట్టిగా పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగానికి, అలాగే మొదటి నుండి బాధితురాలికి అండగా నిలిచిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బండి భగీరథ్ లొంగిపోయాడా లేక పోలీసులు అరెస్ట్ చేశారా అనే కొత్త డ్రామా నడుస్తోందని, నిందితుడికి కఠిన శిక్ష పడేవరకు తమ పోరాటం ఆగదని కేటీఆర్ స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu