Dailyhunt
KTR : రైతు సమస్యలపై ప్రభుత్వానికి కేటీఆర్ అల్టిమేటం

KTR : రైతు సమస్యలపై ప్రభుత్వానికి కేటీఆర్ అల్టిమేటం

NTV Telugu 1 week ago

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి.

అనంతరం జనగామ మండలంలోని యశ్వంతపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ సందర్శించారు. అక్కడ రైతులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. 15 నుంచి 20 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి, మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో సుమారు 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించారని, అయితే ఆ మేరకు కొనుగోలు ప్రణాళికలు రూపొందించలేదని ఆరోపించారు. ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నుల పంటను మాత్రమే కొనుగోలు చేయాలని భావిస్తోందని, మిగతా పంటను నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. పంటను కొనుగోలు చేయకుండా ఆలస్యం చేయడం వల్ల వర్షాల కారణంగా పంట దెబ్బతింటుందని, దీంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు.

అలాగే మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.22,000 కోట్ల అప్పులు తీసుకువచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. సివిల్ సప్లై కార్పొరేషన్‌లో జరిగిన అక్రమాల కారణంగా అక్కడి నుంచి నిధులు రాకపోవడంతో, మార్క్‌ఫెడ్ నిధులను వాడుకుంటున్నారని చెప్పారు. తాను చెప్పిన లెక్కలు తప్పైతే ప్రభుత్వం రుజువు చేయాలని సవాల్ విసిరారు.

రైతులను ఇలాగే ఇబ్బందులకు గురి చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, రేపటి వరకు గడువు ఇస్తున్నామని తెలిపారు. లేకపోతే రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu