Dailyhunt
Liquor Sales: భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు.. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత తాగేశారంటే..?

Liquor Sales: భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు.. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత తాగేశారంటే..?

NTV Telugu 2 weeks ago

Liquor Sales: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు జరిగిన విక్రయాలను పరిశీలిస్తే, ముఖ్యంగా బీర్ మరియు భారతీయ తయారీ మద్యం (ఐఎంఎల్) అమ్మకాలు భారీగా పెరిగాయి.

దీంతో మొత్తం సేల్స్ విలువలో స్పష్టమైన వృద్ధి నమోదైంది. గణాంకాల ప్రకారం, ఐఎంఎల్ విక్రయాలు 362 లక్షల కేసుల నుంచి 414 లక్షల కేసులకు పెరిగి 14.59 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మరోవైపు బీర్ విక్రయాలు మాత్రం 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు పెరిగి 70.29 శాతం భారీ పెరుగుదల సాధించాయి. ఈ పెరుగుదలతో మొత్తం మద్యం అమ్మకాల విలువ రూ.29,440 కోట్ల నుంచి రూ.31,237 కోట్లకు చేరి 6.11 శాతం వృద్ధి నమోదు అయ్యింది.

అయితే, అమ్మకాలు పెరిగినప్పటికీ, ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం ఆశించినంతగా పెరగలేదు. మద్యం సేల్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.24,734 కోట్ల నుంచి రూ.25,727 కోట్లకు పెరిగి 4.01 శాతం వృద్ధి సాధించింది. కానీ, ఎల్‌ఎఫ్ మరియు ఇతర విభాగాల ఆదాయం రూ.4,112 కోట్ల నుంచి రూ.3,316 కోట్లకు పడిపోయి 19.37 శాతం తగ్గింది. ఈ ప్రభావంతో మొత్తం ఆదాయం రూ.28,846 కోట్ల నుంచి రూ.29,042 కోట్లకు మాత్రమే పెరిగి 0.68 శాతం స్వల్ప వృద్ధి నమోదైంది.

తక్కువ ధరల మద్యం అమ్మకాలు పెరగడం కూడా ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపింది. ముఖ్యంగా రూ.99 ధర ఉన్న 180 మిల్లీ లీటర్ బాటిళ్ల వినియోగం పెరగడంతో సుమారు రూ.442 కోట్ల మేర ఆదాయం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ప్రముఖ బ్రాండ్ల ధరలు తగ్గించడంతో మరో రూ.972 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. గత సంవత్సరంతో పోలిస్తే 180 మిల్లీ లీటర్ బాటిల్ సగటు ధర రూ.180 నుంచి రూ.160కి తగ్గడం కూడా ఆదాయంపై ప్రభావం చూపింది. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో లభించిన సుమారు రూ.1,900 కోట్ల నాన్-రీఫండబుల్ ఫీజులు ఈసారి లేకపోవడం వల్ల కూడా రెవెన్యూలో తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ, మొత్తం గణాంకాలు రాష్ట్రంలో మద్యం వినియోగం గణనీయంగా పెరుగుతోందని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఇది ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి కొంత మేర ఉపయోగపడుతుండగా, మరోవైపు సామాజిక, ఆరోగ్యపరమైన అంశాలపై చర్చకు దారితీస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu