Liquor Scam Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ (SIT) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు అరెస్ట్ కావడం, సుదీర్ఘకాలం పాటు విదేశాల్లో తలదాచుకునేందుకు అవకాశాలు లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, అత్యున్నత నాయస్థానం ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా, వెంటనే సిట్ అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో వేరే మార్గం లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా భారత్‌కు బయలుదేరాడు. ఆయనపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ (Lookout Circular) అమలులో ఉండటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి, అదుపులోకి తీసుకుని సిట్ బృందానికి అప్పగించారు. రాజ్ కేసిరెడ్డితో కలిసి ఆర్థిక లావాదేవీల నిర్వహణలో కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. శంషాబాద్‌లో అదుపులోకి తీసుకున్న నిందితుడిని సిట్ అధికారులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. మంగళవారం రోజున ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

