Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?

LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?

NTV Telugu 3 weeks ago

LPG Cylinder: సెప్టెంబర్‌ 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. నెల ప్రారంభంలోనే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.9.50 చొప్పున ధర పెంచాయి.

దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలు, బేకరీలు, స్వీట్‌ షాపులు, ఇతర వాణిజ్య సంస్థలపై ఇంధన వ్యయం కొంత మేర పెరగనుంది. కొత్త ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.2,738 నుంచి రూ.2,747.50కి పెరిగింది. చెన్నైలో రూ.2,906గా ఉన్న ధర తాజాగా రూ.2,916.50కి చేరింది. ఇతర నగరాల్లో స్థానిక పన్నులు, ఇతర ఛార్జీల ఆధారంగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చని చెబుతున్నారు. కమర్షియల్‌ ఎల్పీజీ ధరలు పెరిగినప్పటికీ.. సాధారణ గృహ వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది. 14.2 కేజీల డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలో సెప్టెంబర్‌ 1 నుంచి ఎలాంటి మార్పు లేదు. తాజా ధర పెరుగుదల కేవలం వాణిజ్య సిలిండర్లకే వర్తిస్తుంది. దీంతో ఇళ్లలో వంట కోసం గ్యాస్‌ ఉపయోగించే వినియోగదారులపై తక్షణంగా అదనపు భారం పడలేదు.

వ్యాపారాలపై ఎంత ప్రభావం ఎంతంటే..

ఒక్కో సిలిండర్‌పై రూ.9.50 పెంపు పెద్ద మొత్తంగా కనిపించకపోయినా.. రోజుకు పలు సిలిండర్లు వాడే వ్యాపార సంస్థలకు నెలవారీగా అదనపు ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలు, బేకరీలు, స్వీట్‌ షాపులు వంటి సంస్థలు కమర్షియల్‌ ఎల్పీజీపై ఎక్కువగా ఆధారపడతాయి. ఇంధన ఖర్చులు పెరిగితే భవిష్యత్‌లో ఆహారం, ఇతర సేవల ధరలపై కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. నిజానికి 2026లో వాణిజ్య ఎల్పీజీ ధరల్లో పలుమార్లు ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆగస్టులో కమర్షియల్‌ సిలిండర్ల ధరలు గణనీయంగా తగ్గగా.. అంతకుముందు జూలైలోనూ ధర తగ్గింపు నమోదైంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో తాజాగా రూ.9.50 పెంపు జరిగింది. గత తగ్గింపులతో పోలిస్తే ఈసారి పెరుగుదల స్వల్పంగానే ఉన్నప్పటికీ.. వాణిజ్య వినియోగదారులపై అదనపు వ్యయభారం పడనుంది.

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సమీక్షిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు, విదేశీ మారకపు విలువ, ఇతర వ్యయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరల్లో మార్పులు చేస్తాయి. అందుకే సిలిండర్‌ బుక్‌ చేసుకునే ముందు తమ నగరానికి వర్తించే తాజా ధరను వినియోగదారులు, వ్యాపార సంస్థలు పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా సెప్టెంబర్‌ 1 నుంచి కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలు స్వల్పంగా పెరగగా.. గృహ వినియోగ ఎల్పీజీ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం సాధారణ వినియోగదారులకు ఊరటనిచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu