ప్రధాని మోడీ ఇచ్చిన పొదుపు మంత్రం పిలుపు నాయకుల జీవనశైలిలో మార్పులు తీసుకొచ్చాయి. ముఖ్యమంత్రి అంటే సహజంగా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఉంటాయి.
ఎక్కడికి వెళ్లాలన్న నిశ్చతంగా వెళ్లిపోయేవారు. కానీ ఇప్పుడు దేశంలో పరిస్థితులు మారాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. దీంతో అన్ని దేశాలు కఠినంగా పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కూడా అమలవుతోంది.

ఇందులో భాగంగానే ప్రధాని మోడీ దగ్గర నుంచి కింద స్థాయి నాయకులంతా కాన్వాయ్‌ల సంఖ్య తగ్గించేశారు. గురువారం బుల్లెట్‌పై సచివాలయానికి వెళ్లిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. తాజాగా సాధారణ విమాన ప్రయాణాన్ని ఎంచుకున్నారు. పుణె నుంచి బెంగళూరుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎకానమీ క్లాస్‌లో సాధారణ ప్రయాణికులతో కలిసి ముఖ్యమంత్రి ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణ చర్యలు అమలవుతున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు కూడా సాధారణ జీవనశైలిని అనుసరిస్తున్నారు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ అయతుల్లా ఖమేనీ హతమయ్యారు. అనేక మంది ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు వెళ్లే నౌకలు నిలిచిపోయాయి. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తుండగా.. ప్రస్తుతం భారత్‌లో అమలవుతోంది.

