Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Melania Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై మెలానియా ట్రంప్ కీలక ప్రకటన

Melania Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై మెలానియా ట్రంప్ కీలక ప్రకటన

NTV Telugu 3 hrs ago

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఒలెష్కీలో స్థానికంగా కాల్పుల విరమణకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఈ నెల 29 నుంచి ఈ కాల్పుల విరమణ అమల్లోకి రానున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. యుద్ధం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మానవతా సాయం అందించడంతో పాటు.. వృద్ధులు, ఇతర పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఉక్రెయిన్‌లోని దక్షిణ ఖెర్సన్ ప్రాంతంలో, డ్నిప్రో నదికి అవతల ఉన్న ఒలెష్కీ నగరం 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పటి నుంచి రష్యా ఆక్రమణలో ఉంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఆహారం, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. యుద్ధ పరిస్థితుల కారణంగా పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా క్లిష్టంగా మారింది. రవాణా మార్గాల్లో ప్రమాదాలు, నిరంతర పోరాటం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మానవతా సాయం సరఫరాపై రష్యా, ఉక్రెయిన్ గతంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

ఒలెష్కీ పరిస్థితిపై మెలానియా ట్రంప్ స్పందిస్తూ.. ఈ నగరం తీవ్ర సంక్షోభం అంచున ఉందని పేర్కొన్నారు. తన జోక్యం లేకపోతే అక్కడికి మానవతా సాయం చేరవేయడం, వృద్ధులను సురక్షితంగా తరలించడం సాధ్యమయ్యేది కాదని ఆమె వ్యాఖ్యానించారు. రష్యా, ఉక్రెయిన్ నాయకత్వంతో తాను, తన ప్రతినిధి నేరుగా సంప్రదింపులు జరిపి కాల్పుల విరమణ నిబంధనలను ఖరారు చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి రష్యా, ఉక్రెయిన్ ప్రభుత్వాల నుంచి తక్షణమే బహిరంగ ధ్రువీకరణ వెలువడలేదు.

అబుదాబిలో శాంతి చర్చలు?

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. నవంబర్ మొదటి అర్ధభాగంలో అబుదాబిలో రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక శాంతి చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశముందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించినట్లు కథనం పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ మధ్య జరిగిన సమావేశాల అనంతరం ఈ చర్చల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా వీలైనంత త్వరగా చర్చలను తిరిగి ప్రారంభించేందుకు మద్దతు తెలిపినట్లు సమాచారం.

యుద్ధానికి ముగింపు పలికే తుది శాంతి ఒప్పందంలో భద్రతాపరమైన ఏర్పాట్లపై చర్చలు జరగాలని పుతిన్ అభిప్రాయపడినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కేవలం కొద్దికాలం పాటు కొనసాగే కాల్పుల విరమణతో సమస్య పరిష్కారం కాదన్నది ఆయన వైఖరిగా తెలుస్తోంది. ఒలెష్కీలో ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రధానంగా మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడంపై దృష్టి సారించగా.. నవంబర్‌లో జరగనున్న చర్చలు మొత్తం యుద్ధానికి ముగింపు పలికే దిశగా సాగనున్నాయి. అయితే ఒలెష్కీ కాల్పుల విరమణ అమలు, అబుదాబి శాంతి చర్చలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu