Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!

Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!

NTV Telugu 1 week ago

Mithali Raj: భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తన సుదీర్ఘ క్రీడా ప్రస్థానంలోని కీలక ఘట్టాలు, ఎదుర్కొన్న సవాళ్లపై తాజాగా జరిగిన NTV పాడ్‌కాస్ట్ లో మనసు విప్పారు.

నాయకత్వంలోని ఒంటరితనం, 2018 టీ20 ప్రపంచకప్‌లో చోటుచేసుకున్న వివాదం, ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఆమె అనేక విషయాలను పంచుకున్నారు.

నాయకత్వం అనేది ఒక బాధ్యత..

జట్టును నడిపించడం అనేది ఒక సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగడం కంటే ఎంతో సంక్లిష్టమైన బాధ్యత అని మిథాలీ పేర్కొన్నారు. జట్టు ప్రయోజనాల కోసం కెప్టెన్ తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు, వాటి వెనుక ఉండే కారణాలు అందరికీ అర్థం కావని.. అందుకే కెప్టెన్సీని ఒక ఒంటరి ప్రయాణంగా భావిస్తానని తెలిపారు. సీనియర్ ఆటగాళ్లు ఫామ్‌లో లేనప్పుడు వారికి అండగా నిలవడం, యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వంటి ఎన్నో అంశాలను ఒకేసారి సమన్వయం చేయాల్సి ఉంటుందని చెప్పారు.

డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం..

మైదానంలో ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సహచర క్రీడాకారిణులపై అందరి ముందూ కోపం ప్రదర్శించకూడదనే స్పష్టమైన నియమాన్ని తాను పాటించినట్లు వెల్లడించారు. కెమెరాలు, ప్రేక్షకులు చూస్తున్న సమయంలో ఆటగాళ్లను బహిరంగంగా అరవడం సరైన నాయకత్వ లక్షణం కాదని, జట్టు వైఫల్యాలు లేదా పనితీరుపై సమీక్షలు ఏవైనా సరే కేవలం డ్రెస్సింగ్ రూమ్‌లోని నాలుగు గోడల మధ్యే జరగాలని ఆమె అన్నారు.

2018 వివాదం..

2018 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో తనను బెంచ్‌పై కూర్చోబెట్టడంపై తలెత్తిన వివాదంపై మిథాలీ స్పందిస్తూ.. సమస్య బెంచ్ చేయడం కాదని, కమ్యూనికేషన్ లోపమేనని కుండబద్దలు కొట్టారు. జట్టు కూర్పు కోసం ఒక ఆటగాడిని పక్కన పెట్టడం క్రీడల్లో సహజమైనప్పటికీ, సరైన సమాచారం లేకుండా ఒక సీనియర్ ప్లేయర్‌ను కించపరిచేలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. తన తప్పేమీ లేనప్పుడు ఆత్మగౌరవం కోసమే నిలబడ్డానని, ఆ పరిణామాల అనంతరం ఎదురైన విమర్శలు, ప్రతికూల ప్రచారం తనను మానసికంగా మరింత దృఢంగా మార్చాయని తెలిపారు.

రిటైర్మెంట్ నిర్ణయం..

2022 వన్డే ప్రపంచకప్ అనంతరం ఒకరోజు ప్రాక్టీస్‌లో బ్యాటింగ్ చేయాలనే తపన, అంతర్గత డ్రైవ్ కలగలేదని, క్రికెట్‌కు తాను ఇవ్వగలిగినదంతా ఇచ్చేశానని గ్రహించిన క్షణంలోనే వీడ్కోలు నిర్ణయం తీసుకున్నట్లు మిథాలీ వివరించారు. రిటైర్మెంట్ తర్వాత ఫుల్‌టైమ్ కోచింగ్ వైపు వెళ్లకుండా అడ్మినిస్ట్రేషన్, మెంటార్‌షిప్‌పై దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఐసీసీ (ICC) మహిళల కమిటీ సభ్యురాలిగా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) భాగస్వామ్యంతో గ్రామీణ, జిల్లా స్థాయి బాలికలకు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, శిక్షణ కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu