Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MK Stalin: 'అహంకారం.. వినాశనానికే'.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం

MK Stalin: 'అహంకారం.. వినాశనానికే'.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం

NTV Telugu 3 weeks ago

మిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఉదయనిధి స్టాలిన్ విడుదలైన కొద్దిసేపటికే డీఎంకే అధ్యక్షుడు, ఆయన తండ్రి ఎంకే స్టాలిన్..

ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార పార్టీ అహంకారంతో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ''అహంకారం వినాశనానికి దారితీస్తుంది. అదే అహంకారాన్ని నిరంతరం కొనసాగిస్తే.. వినాశనం మరింత వేగంగా వస్తుంది'' అని హెచ్చరించారు.

ప్రముఖ నటి త్రిషను ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన 'డబుల్ మీనింగ్' వ్యాఖ్యల కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు పోలీసు కస్టడీలో ఉంచిన అనంతరం ఉదయనిధి స్టాలిన్‌ను శనివారం విడుదల చేశారు. తన ప్రసంగంలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయలేదని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన.. విజయ్ ప్రభుత్వంపై పరిపాలనా వైఫల్యాల ఆరోపణలు చేశారు. కావేరీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని, మేకేదాటు ప్రాజెక్టును అడ్డుకోవడంలో కూడా సమర్థంగా వ్యవహరించలేకపోయిందని ఆరోపించారు.

ఈ ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోయిన టీవీకే ప్రభుత్వం.. కావేరీ జలాల అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్టు చేసిందని ఎంకే స్టాలిన్ విమర్శించారు. ''ఉదయనిధి చేసిన ఆరోపణలకు ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయింది. కావేరీ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆయన అరెస్టుకు పాల్పడింది'' అని ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ఒక రోజు ముందు ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్టు చేయడంపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్లు ఆరోపించారు. ''రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ఒక రోజు ముందు ఉదయనిధిని అరెస్టు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉంది. ప్రతిపక్ష నేతను అసెంబ్లీకి దూరంగా ఉంచేందుకే ఈ ప్రయత్నం చేశారు'' అని ఎంకే స్టాలిన్ ఆరోపించారు.

మరోవైపు రాజకీయ విమర్శకులు, ప్రతిపక్ష నాయకులు, విద్యార్థులు, రైతులు, నిరసనకారుల గొంతును అణచివేసేందుకు టీవీకే ప్రభుత్వం పదేపదే అరెస్టులను ఆయుధంగా ఉపయోగిస్తోందని డీఎంకే నేతలు ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే వారిని అరెస్టులతో మౌనం చేయాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఉదయనిధి స్టాలిన్ అరెస్టు, విడుదల వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీసింది. కావేరీ జలాల వివాదం, మేకేదాటు ప్రాజెక్టు, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో డీఎంకే-టీవీకే మధ్య రాజకీయ పోరు మరింత తీవ్రం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu