Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mohan Bhagwat: 'భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు'.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

Mohan Bhagwat: 'భారత్‌లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు'.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

NTV Telugu 1 week ago

RSS chief Mohan Bhagwat: భారత్‌లో ముస్లింలు ఉండకూడదని భావించేవారు అసలు హిందువులే కారని, ఇది హిందూత్వ ఆలోచనా విధానానికే విరుద్ధమని సర్సంఘచాలక్ మోహన్ భగవత్ తేల్చి చెప్పారు.

ప్రపంచంలోని అన్ని మార్గాలు లేదా ధర్మాలు ఆ ఒక్క అంతిమ సత్యం వైపునకే నడిపిస్తాయని, ఇదే హిందూ సాంప్రదాయపు ముఖ్యాంశమని పేర్కొన్నారు. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ‘ఒకే ప్రపంచం, ఒకే మానవత్వం’ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ ప్రసంగించారు. పూజా పద్ధతులు, విశ్వాసాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, అంతిమ సత్యం, మానవత్వం ఒకటేనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన ఉదాహరణను పంచుకున్నారు. మానవులమైన మనం కనీసం ఏడు రంగులను చూడగలిగితే, కుక్కలు కేవలం నలుపు, తెలుపు రంగులను మాత్రమే చూడగలవని ఒక వెటర్నరీ డాక్టర్‌గా తనకు తెలుసన్నారు. కుక్కకు ప్రపంచాన్ని మనం చూసే కోణంలో వివరించలేనంత మాత్రాన, అది చూసే అనుభవం అసత్యం కాదని, అలాగే మానవులుగా మన పరిమితుల పరిధిలోనే మనం సత్యాన్ని గ్రహిస్తామని తెలిపారు. భూమిపై పడే ప్రతి నీటి బొట్టు ఆఖరుకు సముద్రంలోనే కలిసినట్లే, అన్ని ధర్మాలు, మార్గాలు చివరికి ఆ భగవంతుడిలో చేరుతాయని వివరించారు. పూజా విధానాలు కేవలం వెలుగును చూపే వేలు లాంటివని, మనం వేలిని మాత్రమే చూస్తూ ఉండిపోతే అసలైన వెలుగును చూడలేమని గుర్తుచేశారు.

ఇక, 1925లో ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ ప్రయాణం శతాబ్దికి చేరిందని, అయితే ఒకప్పుడు సమాజం తమను ఉపేక్షించిందని, ఈ రోజు తమ మాటలకు గుర్తింపు లభిస్తోందని మోహన్ భగవత్ చెప్పారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ముస్లిం సోదరులు తమ భవిష్యత్తు గురించి అడిగిన ప్రశ్నను గుర్తు చేసుకుంటూ, హిందూ రాష్ట్రంలో అందరికీ సమాన స్థానం ఉంటుందని, సమాజంలోని ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కాలనేదే తమ విధానమని స్పష్టం చేశారు. ఒక జ్ఞాని అయిన వ్యక్తి విద్వాంసుడైన బ్రాహ్మణుడిలోనూ, కుక్కలోనూ ఒకే రకమైన ఆత్మచైతన్యాన్ని చూస్తాడని తెలిపారు. ఈ జ్ఞానమంతా ఇప్పటికే మన సాంప్రదాయాలలో ఉందన్న భగవత్, సమస్య జ్ఞానం లేకపోవడం కాదని, దానిని రోజువారీ ప్రవర్తనలో అమలు చేయకపోవడమేనని అన్నారు. సమాజంలో మార్పు తీసుకురాకుండా కేవలం రాజకీయం ద్వారానే మార్పు సాధ్యం కాదని, అందుకే తాము రాజకీయాల కంటే ముందు సమాజంలోనే మార్పునకు శ్రీకారం చుట్టామని చెప్పారు. 2018 తర్వాత ముస్లిం, క్రైస్తవ సమాజాల ప్రతినిధులతో నిరంతరం సంభాషణలు జరుపుతున్నామని, సంభాషణతో పాటు సేవా కార్యక్రమాలను కూడా ముమ్మరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలాంటి వివక్ష లేకుండా దాదాపు 1,30,000 సేవా ప్రాజెక్టుల ద్వారా అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్‌ఎస్‌ఎస్ సేవలు అందిస్తోందని వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu