నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమించడానికి సిద్ధమవుతున్నాయి. నాలుగైదు రోజుల్లో రాజస్థాన్ ప్రాంతం నుంచి ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఉపఖండం నుంచి రుతుపవనాలు పూర్తిగా వెనక్కి వెళ్తే వానాకాలం ముగిసినట్టే లెక్క. ఇటీవలి అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలే ఈ సీజన్లో అత్యధిక వర్షపాతంగా నిలిచాయి. మరో రెండు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీలోని శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు విస్తారంగా వర్షాలు కురిపించింది. మలికిపురంలో గరిష్టంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే గణనీయమైన లోటు కనిపిస్తోంది. ఈ నెల 19 నాటికి పశ్చిమ రాజస్థాన్ నుంచి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం కానుందని ఐఎంజీ ప్రకటించింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న రుతుపవన ద్రోణి, వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అంచనాల కంటే ఆలస్యంగా జూన్ 4న కేరళలోకి ప్రవేశించినప్పటికీ, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జూలై నాటికి దేశమంతా విస్తరించినా చినుకులు పడలేదు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే వర్షాకాలంలో మొదటి మూడు నెలలు తీవ్ర ఎండలు, చెదురుమదురు జల్లులకే పరిమితమయ్యాయి. మంచి వర్షపాతం అందించాల్సిన అల్పపీడనాలు, వాయుగుండాలు అన్నీ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు తరలిపోవడంతో ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. ప్రస్తుతం కురుస్తున్న కొద్దిపాటి వర్షాలతో ఈ సీజన్ ముగింపు దశకు చేరుకుంది.

