'కొత్త బంగారు లోకం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు క్యూట్ పెయిర్‌గా పరిచయమైన వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ దాదాపు 18 ఏళ్ల తర్వాత 'నా వైఫ్ మిస్సింగ్' సినిమాతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
పదేళ్ల విరామం తర్వాత శ్వేతా బసు ప్రసాద్ తెలుగులోకి రీ-ఎంట్రీ ఇవ్వడం, క్రైమ్ థ్రిల్లర్ జానర్ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 23 నుంచి ‘ఆహా’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో నా వైఫ్ మిస్సింగ్ రివ్యూలో చూద్దాం.
నా వైఫ్ మిస్సింగ్ కథ
బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ బాలు (వరుణ్ సందేశ్) తన భార్య స్వప్న (శ్వేతా బసు ప్రసాద్) కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ మొదలవుతుంది. పెళ్లి చూపుల్లోనే తాను వర్జిన్ కాదని స్వప్న చెప్పినా బాలు అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు. పెళ్లి తర్వాత తన ప్రియుడు అబాన్ (మోహిత్ పెద్దాడ) వద్దకు వెళ్లిపోతానని స్వప్న చెప్పగా, దానికి కూడా బాలు సైలెంట్‌గా ఒప్పుకుని ఆమెను పంపించేందుకు ఓ ప్లాన్ వేస్తాడు. కానీ సడెన్‌గా స్వప్న మిస్ అవ్వడంతో పోలీసులు బాలును అరెస్ట్ చేస్తారు. అయితే స్వప్న తన దగ్గరకు రాలేదని అబాన్ చెప్పి బాలుకు బెయిల్ ఇప్పిస్తాడు. అసలు స్వప్న ఏమైంది? ఆమె మిస్సింగ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ
ఒక అమ్మాయి మిస్ అవ్వడం, ఆమెను వెతకడం అనేది థ్రిల్లర్ సినిమాల్లో రొటీన్ పాయింటే అయినా.. పెళ్లి తర్వాత కూడా పాత ప్రేమలను కొనసాగించడం వల్ల ఎదురయ్యే దారుణ పరిణామాలను సమకాలీన సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా దర్శకురాలు తెరకెక్కించారు. గతం, వర్తమానం మధ్య కథను నడిపించిన స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. బాలు, స్వప్నల వివాహం, అబాన్ ఎంట్రీతో సాగే ఫస్ట్ హాఫ్.. ఇంటర్వెల్ సమయానికి స్వప్న మిస్సింగ్ బ్యాంగ్‌తో సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సినిమా నేరేషన్ చాలా స్లోగా సాగుతుంది. మలయాళ థ్రిల్లర్ సినిమాలను తలపించేలా సన్నివేశాలు నిదానంగా సాగడం వల్ల కొన్నిసార్లు ప్రేక్షకులకు ఫార్వార్డ్ చేయాలనే భావన కలుగుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ చుట్టూనే తిరుగుతుంది. క్లైమాక్స్‌లో స్వప్న ఏమైంది అనే ట్విస్ట్ ఊహించని విధంగా ఉన్నా, ఆ తప్పు ఎవరు చేశారనేది మాత్రం సులభంగానే పసిగట్టేయొచ్చు. సాదాసీదా లవ్ ట్రాక్ నుంచి కథ ఒక్కసారిగా థ్రిల్లర్ మోడ్‌లోకి మారిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది.
నటీనటుల పనితీరు విషయానికి వస్తే వరుణ్ సందేశ్ భార్య మిస్ అయిన టెన్షన్, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో బాలు పాత్రలో వరుణ్ తన పరిణతి చెందిన నటనను కనబరిచాడు. ఎమోషన్స్‌ను చక్కగా పండించాడు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన శ్వేతా, స్వప్న పాత్రలో సింపుల్‌గా, సెటిల్డ్‌గా నటించి మెప్పించింది. జబర్దస్త్ సత్యశ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సర్ ప్రైజ్ చేయగా, నటుడు ప్రవీణ్ తన మార్క్ పోలీస్ క్యారెక్టర్‌తో ఆకట్టుకున్నాడు. మోహిత్ పెద్దాడ బాయ్‌ఫ్రెండ్ అబాన్ పాత్రకు మోహిత్ తన పరిధి మేరకు న్యాయం చేశాడు.
సాంకేతిక వర్గం విషయానికి వస్తే దర్శకురాలు స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ ఎంచుకున్నది పాత పాయింటే అయినా, సాంకేతికంగా సినిమాను డీసెంట్‌గా ప్రెజెంట్ చేశారు. సాయి కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. కొన్ని ట్యూన్స్ గత సినిమాలను గుర్తుచేసినా, థ్రిల్లర్ ఫీల్‌ను ఎలివేట్ చేయడంలో బీజీఎమ్ సక్సెస్ అయింది. ఎన్.ఎస్. సతీష్ కుమార్ సినిమాటోగ్రఫీ విజువల్స్, లొకేషన్స్ మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. ఆదిత్య భార్గవ్ రాసిన సంభాషణలు సహజంగా ఉన్నాయి. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై శివ కంఠంనేని ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు అవసరమైన ఖర్చు చేశారు. ఎడిటర్ సాయిబాబు తలారి కత్తెరకు సెకండ్ హాఫ్‌లో ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిదానంగా సాగే ఇన్వెస్టిగేషన్, సామాజిక కోణం మిళితమైన క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవారికి, కాస్త ఓపికగా ట్విస్టుల కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు ‘నా వైఫ్ మిస్సింగ్’ ఒక ఓటీటీ ఆప్షన్.
ఫైనల్లీ నా వైఫ్ మిస్సింగ్ స్లో క్రైమ్ థ్రిల్లర్

