Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్

Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్

NTV Telugu 1 week ago

తెలంగాణ కమలం పార్టీలో ఓ కార్యక్రమం మొక్కుబడి తంతుగా నడిచిపోతోందా? ఎవరు, ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారో కూడా క్లారిటీ లేకుండా… ఏదో పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి మేం గుడ్డెద్దు చేలో పడ్డట్టు నిర్వహిస్తున్నామని పార్టీ నేతలే అంటున్నారా?

ఇంకా మాట్లాడితే… ఆ ప్రోగ్రామ్‌ని రాష్ట్ర నేతలు చాలామంది శిక్షగా భావిస్తున్నారా? అంతలా ఇబ్బంది పెడుతున్న ఆ కార్యక్రమం ఏది? ఎందుకు మమ అనిపిస్తున్నారు? దేశ వ్యాప్తంగా మెగా ట్రైనింగ్ కాంపెయిన్ నిర్వహిస్తోంది కమలం పార్టీ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ…. ట్రైనింగ్ మెగా కాంపెయిన్ పేరుతో ఈ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగానే… తెలంగాణలో కూడా నడుస్తున్నాయి. కానీ… వీటివల్ల ఎవరికి, ఎంత లాభం అన్నది ప్రశ్నార్థకంగా ఉందట. అసలు ఈ ప్రక్రియ ఎంత సీరియస్‌ సాగుతోందన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. వీటిపై రాష్ట్ర నాయకులు చాలా మంది పెదవి విరుస్తున్నారు. ఇదొక ప్రహసనంగా మారిందని, దీని వల్ల పెద్దగా వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదనే అంటున్నట్టు తెలుస్తోంది. ముందసలు శిక్షణ ఎవరికి ఇవ్వాలనే దానిపైనే క్లారిటీ లేదట.

చాలా చోట్ల ఇప్పటికీ… కింది స్థాయి కమిటీలే వేయలేదు, ఇక పిలిస్తే వచ్చేదెవరని అంటున్నట్టు సమాచారం. ఇప్పటికే మండల స్థాయి శిక్షణ తరగతులు జరిగాయి. వాటిని నిర్వహించిన తీరు పై విమర్శలు వస్తున్నాయి. వ్యవహారం మొత్తం తూతూ మంత్రంగా జరిగిపోయిందని అంటున్నారు. ఆ శిక్షణ తరగతులు ఎలా జరిగాయన్న దానిపై రిపోర్ట్ కావాలని రాష్ర్ట ఇన్చార్జి అభయ్ పాటిల్ ఆదేశించారు కూడా. కానీ… కొన్ని చోట్ల సంఖ్య కోసం పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేని ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టు చెప్పుకుంటున్నారు. అసలీ శిక్షణ తరగతులు ఓ శిక్షగా మారాయన్న గుసగుసలు సైతం పార్టీలో వినిపిస్తున్నాయి. ఇక త్వరలో జిల్లా స్థాయి ప్రశిక్షణ వర్గలు ప్రారంభం కాబోతున్నాయి. కానీ…చాలా జిల్లాల్లో ఇప్పటికీ అనుబంధ మోర్చా కమిటీలు కూడా పడలేదు. అసలు ఆ కమిటీల్లో ఎవరికి అవకాశం వస్తుందో కూడా తెలియదు. దీంతో… ఎలాంటి బాధ్యతలు లేకుండా… శిక్షణా తరగతులకు పిలిస్తే ఎవరొస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఓవరాల్‌గా కేంద్ర పార్టీ మానిటర్ చేస్తోంది కాబట్టి… ఏదో, అలా అలా…. చేశామంటే చేశామన్నట్టు లెక్క చెప్పుకోవడం కోసం రాష్ట్రంలో మొక్కుబడి కార్యక్రమం నడుస్తోందని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. సీరియస్‌గా కాకుండా…కేవలం టిక్కు పెట్టించుకోవడం కోసమే శిక్షణా తరగతులు నడుస్తున్నాయన్నది పార్టీ ఇంటర్నల్‌ ఒపీనియన్‌.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu