Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Off The Record: సీఎం టేబుల్‌పై అవినీతి అధికారుల రహస్య చిట్టా.. నెక్స్ట్ టార్గెట్ వీళ్లేనా..?

Off The Record: సీఎం టేబుల్‌పై అవినీతి అధికారుల రహస్య చిట్టా.. నెక్స్ట్ టార్గెట్ వీళ్లేనా..?

NTV Telugu 1 week ago

Off The Record: తెలంగాణ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, బాగా కీలకమైన పోస్ట్‌ల్లో ఉన్న వాళ్ళ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారట.

ఇటీవల ప్రభుత్వంలోని పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు అవినీతి నిరోధకశాఖకు చిక్కడం, దర్యాప్తులో వందల కోట్ల ఆస్తులు బయటపడటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే… కొన్ని శాఖల పని తీరుపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు చెప్పుకుంటున్నాయి అధికార వర్గాలు. వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారు సీఎం. ఆ క్రమంలో… కొన్ని నివేదికలు వరుసగా సీఎం టేబుల్‌పైకి చేరుతున్నట్టు తెలుస్తోంది. ఏ డిపార్ట్‌మెంట్‌లో ఎలాంటి అక్రమాలు జరిగాయి? ఎక్కడ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయన్న వివరాలతో సమగ్ర చిట్టా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. విజిలెన్స్ దర్యాప్తులో బయటపడిన అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించేందుకు సీఎం సిద్ధమవుతున్నారని సమాచారం. చిన్న స్థాయి అధికారులకే పరిమితం కాకుండా, నిర్ణయాలు తీసుకున్న ఉన్నతాధికారుల్ని కూడా బాధ్యుల్ని చేసేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారన్నది సెక్రటేరియెట్‌ టాక్‌. కొన్ని శాఖల్లో టెండర్లు, పనుల కేటాయింపులు, కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై లోతైన పరిశీలన కొనసాగుతోందని చెబుతున్నారు. నివేదికల్లో తేలిన అంశాల ఆధారంగా అవసరమైతే క్రమశిక్షణ చర్యలు, బదిలీలు, మరింత లోతైన దర్యాప్తు వంటి నిర్ణయాలు ఉండొచ్చన్న ప్రచారం కూడా సాగుతోంది.

అయితే, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, సీఎం దగ్గర శాఖల వారీ విజిలెన్స్ చిట్టా సిద్ధంగా ఉందట. దీంతో… ఇక ఎవరి పేర్లు బయటకు వస్తాయోనంటూ సచివాలయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన విషయాలను వివరించడంతో పాటు కొత్త పనులకు అయ్యే ఖర్చుల గురించి కూడా సీఎంకు చెప్పారు అధికారులు. అయితే… ఆయన మధ్యలో కలుగజేసుకుని మీరు చెప్పే కొత్త పనికి అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు కావు.. గత ఏడాదే మీరు ఎక్కువ ఖర్చు చేసి చూపారు…. ఏయే అధికారి ఎంతెంత వాటా తీసుకున్నారో నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని చెప్పడంతో ఆఫీసర్స్‌ అంతా అవాక్కయ్యారట. సదరు కాంట్రాక్టర్ దక్కించుకున్న పనికి ఎంత ఖర్చు చేశారో ఆధారాలు చూపడంతో ఆఫీసర్స్‌కు నోట మాట రాలేదని అంటున్నారు. అంతకు ముందు జరిగిన మరో శాఖ సమీక్షలో ఓ అధికారి ఒక నేత మెప్పు కోసం ఎలాంటి ప్రపోజల్స్ లేకుండానే రోడ్డు నిర్మించారంటూ వివరాలు ముందు పెట్టారట ముఖ్యమంత్రి. దీంతో సదరు అధికారి ఎలాంటి సంజాయిషీ ఇవ్వాలో తెలియక నీళ్లు నమిలినట్లు తెలిసింది. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ నుంచి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి నివేదికలు తెప్పించుకుని వాటిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. సందర్భానుసారంగా వాటిలోని అంశాలను ఒక్కొక్కటిగా బయట పెడుతుండటంతో ఆయనకు అన్ని విషయాలు తెలిసి పోతున్నాయనే ఆందోళనలో అవినీతి అధికారులు ఉన్నారట. దీంతో… సీఎంతో సమీక్షకు వెళ్లాలంటేనే అధికారులు ఒకటికి రెండు సార్లు క్రాస్‌చెక్‌ చేసుకుంటున్నారన్నది లేటెస్ట్‌ టాక్‌.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu