Dailyhunt
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

NTV Telugu 1 week ago

కాకలు తీరిన రాజకీయ నాయకులంతా అక్కడ కామ్‌గా ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందా? దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడితే… కనీసం పార్టీ పదవి కూడా ఇవ్వలేదంటూ వాళ్ళు తీవ్ర అసహనంతో ఉన్నారా?

2024లో టిక్కెట్లు దక్కలేదు సరికదా… చివరికి పార్టీ పదవులు కూడా ఇవ్వకుంటే ఇక మా సీనియారిటీకి అర్ధం ఏంటని అడుగుతున్న ఆ టీడీపీ సీనియర్స్‌ ఎవరు? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ సీనియర్స్‌ చాలామంది మింగలేక కక్కలేక అన్నట్టు ఉన్నారట. పదవుల విషయంలో వాళ్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కొందరేమో… దాన్ని అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో బహిరంగంగా వ్యక్తం చేస్తుంటే… మరి కొందరు మాత్రం పరువు సమస్య అంటూ… లోలోపల సన్నిహితుల దగ్గర గోడు వెళ్ళబోసుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లకు గాను… 11 టీడీపీ, ఒకటి బీజేపీ గెల్తుకున్నాయి. రెండు ఎంపీ సీట్లు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి.

ఈ ఘన విజయంలో కొద్దోగొప్పో తమ పాత్ర ఉందని, అయినాసరే…. గుర్తించకుండా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంగానీ, పార్టీలోగానీ ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదంటూ తెగ బాధపడిపోతున్నారట సీనియర్స్‌. ఇటీవల ప్రకటించి పార్టీ పదవుల్లో కొందరికి కీలక స్థానాలు ఇచ్చింది టీడీపీ అధిష్టానం. కానీ… తమను విస్మరించారంటూ సీనియర్స్‌ ఆవేదనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకొని ఉన్నవాళ్ళలో ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ముందు వరుసలో వుంటారు. ఆదోని నుంచి మూడు సార్లు గెలిచారాయన. 2024 ఎన్నికల్లో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా కూటమి పొత్తులో భాగంగా ఆదోని సీటు బీజేపీ కోటాలోకి వెళ్ళిపోయింది. అందుకు బదులు మీనాక్షి నాయుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు నెరవేరలేదు.

ఇక పార్టీలోనూ ఎలాంటి పదవి దక్కలేదనే అసంతృప్తి ఉందట మాజీ ఎమ్మెల్యేకి. ఆదోని టీడీపీ ఇన్చార్జ్‌గా వున్నా ఒక్కమాట కూడా చెల్లుబాటు కావడం లేదని ఆయన బహిరంగంగానే అక్కసు వెళ్లగక్కిన సందర్భాలు అనేకం. ఇక మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కూడా అదే జాబితాలో ఉన్నారట. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా పనిచేసిన కేఈ ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. 2024 ఎన్నికల్లో ఆలూరు, డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని పట్టుబట్టినా అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో తరచూ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారట ఆయన. అధికార పదవి దక్కక, పార్టీ పదవి లేక ఇక నాకు విలువేముందని సన్నిహితుల దగ్గర అంటున్నట్టు సమాచారం. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా 2024 ఎన్నికల్లో టికెట్ కోసం పట్టుబట్టారు.

ఒకదశలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎన్టీఆర్ , చంద్రబాబు ఫోటో పెట్టుకొని ప్రచారం చేస్తానని అల్టిమేటం ఇచ్చారు. అయినా టికెట్ దక్కలేదు. ఆయనకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినా నో యూజ్‌. పోనీ పార్టీ పదవి అయినా ఇస్తారని ఆశించినా… అదీ రాలేదు. దీంతో భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా పార్టీతో అంటీ ముట్టనట్టు వుంటున్నారట. అటు ఏవీ సుబ్బారెడ్డిది కూడా అదే పరిస్థితట. ఒకవైపు ఆళ్లగడ్డలో భూమా అఖిల , ఏవీ సుబ్బారెడ్డి మధ్య వార్ నడుస్తుండగా మరోవైపు అధికారిక పదవి లేకపోవడం, పార్టీ పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారట ఆయన. మీనాక్షి నాయుడు, కేఈ పొలిటికల్ రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్నారర. ఈ పరిస్థితుల్లో పార్టీ పదవైనా దక్కుతుందా అని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. ఇక భూమా బ్రహ్మానంద రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి కూడా ఇలా ఎంతకాలం అనే ధోరణిలో ఉన్నారట.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu