OG 2: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగే. తమ అభిమాన హీరో నుంచి ఏదైనా కొత్త అప్‌డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తుంటారు.
'OG' సినిమాతో పవన్ కళ్యాణ్‌ను సరికొత్త గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో చూపించిన దర్శకుడు సుజీత్‌తో మరోసారి పవర్‌స్టార్ జత కట్టినప్పటినుంచి 'OG 2'పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే పవన్ బర్త్‌డే వచ్చేసినా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి పెద్ద అప్‌డేట్ లేకపోవడంతో అభిమానుల్లో కొంత నిరాశ కనిపించింది. కానీ ఇప్పుడు దర్శకుడు సుజీత్ చేసిన పోస్ట్ తో అభిమానులకు ఊరట లభించేలా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ దర్శకుడు సుజీత్ ఈ రోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. పవర్‌స్టార్‌పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేసిన ఆయన, అదే పోస్ట్ చివర్లో సాయంత్రం 4:05 గంటలకు ఒక చిన్న సర్‌ప్రైజ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. దీంతో పవన్ అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్కంఠ మొదలైంది. ఇంతకీ ఆ సర్‌ప్రైజ్ 'OG 2'కు సంబంధించినదేనా, లేక OG యూనివర్స్‌లోని మరో అంశానికి సంబంధించినదా అనే చర్చ మొదలైంది.
వాస్తవానికి 'OG 2' ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ గతంలో పవన్ కళ్యాణ్, సుజీత్ కలయికలో OG యూనివర్స్‌ను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. దీంతో తొలి భాగంతో పరిచయమైన గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని రెండో భాగంలో మరింత పెద్ద స్థాయిలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా గతంలో 'OG 2'కు సంబంధించి బర్త్‌డే సందర్భంగా ఏదో ఒక సర్‌ప్రైజ్ ఉండొచ్చనే విధంగా హింట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు సుజీత్ ఒక పవర్‌ఫుల్ యానిమేటెడ్ వీడియోను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం కూడా ఫిలింనగర్ వర్గాల్లో జరిగింది. దీంతో ఇప్పుడు దర్శకుడు చెప్పిన 4:05 సర్‌ప్రైజ్ గ్లింప్స్ అవుతుందా, యానిమేటెడ్ వీడియోనా, ఫస్ట్ లుక్ పోస్టరా లేక చిన్న ప్రమోషనల్ కంటెంట్ మాత్రమేనా అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు.
అలాగే 'OG 2' షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేదు. బర్త్‌డే సందర్భంగా పోస్టర్ లేదా చిన్న గ్లింప్స్ విడుదల చేసినా వెంటనే షూటింగ్ మొదలవుతుందని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి ప్రొడక్షన్ ప్లాన్, పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండే తేదీలు వంటి అంశాలపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. అందుకే ఇప్పుడు పవన్ అభిమానుల దృష్టి మొత్తం సాయంత్రం 4:05 గంటలపైనే ఉంది. సుజీత్ చెప్పిన ఆ చిన్న సర్‌ప్రైజ్ నిజంగా 'OG 2' గ్లింప్సా, పవన్ కళ్యాణ్ కొత్త లుక్కా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

