Dailyhunt
Oracle Layoffs 2026: ఎలాంటి హెచ్చరికలు లేకుండా 30 వేల మంది తొలగింపు.. కన్నీటి పర్యంతమైన ఉద్యోగులు..

Oracle Layoffs 2026: ఎలాంటి హెచ్చరికలు లేకుండా 30 వేల మంది తొలగింపు.. కన్నీటి పర్యంతమైన ఉద్యోగులు..

NTV Telugu 2 weeks ago

Oracle Layoffs 2026: ప్రపంచ ఐటీ రంగాన్ని కుదిపేసేలా Oracle Corporation లో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చోటుచేసుకున్నాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కంపెనీ మొత్తం ఉద్యోగులలో దాదాపు 18 శాతానికి సమానమని సమాచారం. మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో వేలాది మంది ఉద్యోగులకు తమ ఉద్యోగాలు రద్దు చేసినట్లు ఈమెయిళ్లు రావడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా వచ్చిన ఈ నిర్ణయం ఉద్యోగులను మానసికంగా తీవ్రంగా కుంగుబాటుకు గురిచేసింది..

AP Weather Alert: అలర్ట్.. 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!

ఈ తొలగింపులు ఒరాకిల్ హెల్త్, సేల్స్, క్లౌడ్, కస్టమర్ సక్సెస్, నెట్‌సూట్ వంటి కీలక విభాగాలను ప్రభావితం చేశాయి. భారతదేశంలోని పూణే, హైదరాబాద్ నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ ప్రభావం మరింతగా పడింది. తమ ఉద్యోగాలు కోల్పోయిన వారు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు వెల్లడించారు. పూణేకు చెందిన 12 ఏళ్ల అనుభవం ఉన్న ఒక సీనియర్ ఐటీ ఇంజనీర్ మాట్లాడుతూ, తాను సాధారణంగా పనికి లాగిన్ అవ్వగా తన సిస్టమ్ యాక్సెస్ నిలిపివేయబడిందని, కొద్దిసేపటికే ఉద్యోగం కోల్పోయినట్లు ఈమెయిల్ వచ్చిందని తెలిపారు. ఇంత అనుభవం ఉన్నప్పటికీ ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పారు. అయితే, కంపెనీ ఒక నెల జీతం, రెండు నెలల అదనపు జీతం రూపంలో పరిహారం అందించినట్లు తెలిపారు.

మరో ఉద్యోగి ఇటీవల గృహ రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసినట్లు చెబుతూ, ఇప్పుడు ఈఎంఐలు ఎలా చెల్లించాలన్న ఆందోళన వ్యక్తం చేశాడు. కుటుంబ ఖర్చులు, పిల్లల విద్య వంటి అంశాలు తనపై భారీ ఒత్తిడిని పెంచుతున్నాయని వాపోయాడు. హైదరాబాద్‌కు చెందిన మరో ఐటీ ఉద్యోగి మాట్లాడుతూ, తాను 10 సంవత్సరాలుగా కంపెనీలో పనిచేస్తున్నానని, కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో కూడా సంస్థకు సేవలందించానని చెప్పారు. తన పనితీరును కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించడం తీవ్రంగా బాధించిందన్నారు. "కంపెనీ పరిహారం ఇస్తోంది కానీ కుటుంబాన్ని ఎలా పోషించాలి?" అని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాధారణంగా ఐటీ రంగంలో ప్రతి ఏడాది 4-5 శాతం ఉద్యోగ కోతలు జరుగుతుంటాయి. అయితే, ఈసారి ఒరాకిల్ తీసుకున్న నిర్ణయం చాలా పెద్దదిగా భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడం వంటి అంశాలు ఈ నిర్ణయానికి కారణాలుగా పేర్కొంటున్నారు. గత దశాబ్దంలో ఇదే అతిపెద్ద ఉద్యోగ కోత కావచ్చని సంస్థలోని ఉన్నతాధికారి ఒకరు సూచించారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పెరగవచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu