Dailyhunt
OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

NTV Telugu 3 weeks ago

పార్టీ ఓల్డ్ ఏజ్ హోమ్ అవ్వబోతుందా.. అందరూ వృద్ధ నాయకులను పార్టీలోకి తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయా.. అలాంటి విమర్శలకు పార్టీ ఎలాంటి సమాధానమిస్తుంది..

ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కామెంట్ పై పార్టీలో ప్రశ్నిస్తున్న యువ నేతలకు పార్టీ ఎలాంటి భరోసా ఇస్తుంది.. వాచ్ దిస్ స్టోరీ.

కాంగ్రెస్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, చివరికి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి కారెక్కేందుకు సిద్దమయ్యారు. అయితే ఆయన అధికారికంగా చేరకముందే గులాబీ తోటలో చిన్నపాటి ప్రకంపనలకు కారణమయ్యారు. బీఆర్ఎస్ కూడా పార్టీలో చేరకముందే జీవన్ రెడ్డికి టాప్ ప్రయారిటీని చేతల్లో చూపించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనని పార్టీలోకి ఆహ్వానించడం, ఆ తర్వాత ఆయన స్వయంగా వచ్చి అధినేత కేసీఆర్ కలవడం చకచకా జరిగిపోయాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో ఓ కామెంట్ వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ ఓల్డేజ్ హోమ్‌గా మారిందన్న కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటివరకు అనేక పార్టీలు తిరిగి, తమ రాజకీయ ప్రస్థానం ముగించే సమయానికి బిఆర్ఎస్ లో చేరుతున్నారన్న సెటైర్లు పేలిపోతున్నాయి. వృద్ధ నాయకులకు షెల్టర్ జోన్‌గా మారిపోయిందన్న కామెంట్లు చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతో పాటు ఇప్పుడు చేరబోతున్న జీవన్ రెడ్డిని అందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

సోషల్ మీడియాలోనో, ప్రత్యర్థి పార్టీల నాయకులో ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం లేదు. సొంత పార్టీలోని కొందరు యువ కార్యకర్తలు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారన్న తెలుస్తోంది. అన్ని పదవులు అనుభవించిన ముసలి నేతలకే మళ్లీమళ్లీ అవకాశాలిస్తే…తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారట. అంతటితో ఆగని యువ నేతలు…సదరు ఓల్డేజ్ లీడర్లు పెద్దపెద్ద పదవులు అనుభవించి వచ్చినదారిలోనే తుర్రుంటారని ఉదాహరణలతో సహా చెబుతున్నారు. అయితే, గులాబీ అధిష్టానం మాత్రం వీరందరికి సర్దిజెప్పే ప్రయత్నం చేస్తోంది. బయట ఎన్ని విమర్శలు ఉన్నా సరే.. జనాల్లో క్రేజ్ తోపాటు, పార్టీకి ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళని కచ్చితంగా తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని నచ్చజెబుతున్నారు. సీనియర్లు తమ పార్టీలో చేరినంత మాత్రాన యువనాయకత్వంపై ఎక్కడా చిన్నచూపు ఉండదని భరోసా ఇస్తున్నారు. మరోవైపు బిఆర్ఎస్ అధికారంలో లేకపోయినా, ఎలాంటి లాభాపేక్ష లేకుండానే నేతలు తమ పార్టీలో చేరడానికి వస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో పార్టీలో చేరుతున్న జీవన్ రెడ్డి లాంటి నేతలను వ్యతిరేకించిన ఒకరిద్దరూ యువ నేతలను ఒప్పించేందుకు ట్రై చేస్తున్నారు. ఈ సమయంలో పార్టీ నేతలతో పాటు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా తమ భవిష్యత్తుపై పార్టీ దగ్గర మొరపెట్టుకున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు వచ్చినంత మాత్రాన యువ ఎమ్మెల్యేలకు కానీ, నేతలకు కానీ ఎలాంటి పోటీ కాడని బిఆర్ఎస్ నేతలు ఊరడించే మాటలు చెబుతున్నారు.

పార్టీలోకి వచ్చిన వాళ్లను తక్కువ చేసి చూడకుండా, ఆల్రెడీ వున్న వాళ్ల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గించకుండా చూసే బాధ్యత తమది అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పెద్దలు. చూడాలి భవిష్యత్తులో యువ నేతలకు వృద్ధ నేతలు పోటీ అవ్వబోతున్నారా.. లేక పార్టీలో అందరితోపాటు తమ కూడా అవకాశాలు వస్తాయని యువనాయకత్వం సర్దుకుని పోతుందో కాలమే సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu