Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్‌ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?

OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్‌ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?

NTV Telugu 2 weeks ago

నిన్నటిదాకా ఎమ్మెల్యేలతో సమానంగా ఢీ అంటే ఢీ అన్నారు. ప్రాధాన్యతలు, ప్రోటోకాల్‌ కోసం జనసేన ఎమ్మెల్యేలతో పోటీ పడ్డ అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్‌లు ఉన్నట్టుండి… ఎవరు బాబూ మీరు అన్నట్టు మారిపోయారు.

మీకో నమస్కారం… మీరూ వద్దు, మీ నీడా మా మీద పడొద్దంటూ దూరం జరిగిపోతున్నారు. నువ్వా నేనా అన్నవాళ్ళు ఉన్నట్టుండి ఎందుకు సడన్‌గా సైలెంట్‌ అయిపోయారు? ఏ జిల్లాలో అలా జరుగుతోంది?

కూటమి ఎమ్మెల్యేలు కొందరు హద్దులు దాటేస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రే హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని బలమైన సంకేతాలిస్తున్నారు. అయినా సరే… ఎక్కువ మంది శాసనసభ్యుల వ్యవహార శైలిలో మార్పు రావడం లేదని ప్రస్తుతం కూటమి పార్టీల్లోనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో అటు ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఆరోపణలు చేయడమే కాదు… చిన్న ఆధారం దొరికినా… ఉతికి ఆరేసేస్తోంది. దీంతో….. ఉమ్మడి విశాఖ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగుల కంటే సీనియర్ నేతలు ఎక్కువ అలెర్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన జిల్లాలో ఉమ్మడి విశాఖ ఒకటి. మొత్తం 13 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు కూటమి ఖాతాలో వున్నాయి. అయితే… ఇక్కడ జనసేన గెలుచుకున్న పెందుర్తి, అనకాపల్లి, విశాఖ దక్షిణ, యలమంచిలి నియోజకవర్గాల్లో టీడీపీకి కూడా బలమైన నాయకత్వం వుంది. మాజీ ఎమ్మెల్యేలు గండిబాబ్జీ, పీలాగోవింద్ సత్యనారాయణతో పాటు సీనియర్ నేతలు సీతంరాజు సుధాకర్, ప్రగడ నాగేశ్వరరావు టీడీపీ ఇన్ఛార్జ్‌లుగా ఉన్నారు. వీళ్ళందరికీ నామినేటెడ్‌ కోటాలో కీలకమైన కార్పొరేషన్ల చైర్మన్ల పదవు దక్కాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్ధాయికి దాదాపు సమాన హోదాను కట్టబెట్టింది టీడీపీ. సరిగ్గా ఇక్కడే ఆధిపత్య పోరు మొదలైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో సమానంగా ప్రాధాన్యత దక్కడం, ప్రోటోకాల్ లభిస్తుండటం, కీలక సమావేశాలకు వాళ్ళు కూడా తమతో పాటు కలిసి రావడాన్ని జనసేన ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోయారట. ఈ క్రమంలోనే జనసేన ఎమ్మెల్యేలు వర్సెస్‌ టీడీపీ ఇన్చార్జ్‌లుగా వార్ ముదిరి రెండు పార్టీల కేడర్‌ ఇబ్బందులు పడ్డారు. దాంతో ఇరు పార్టీల అధినాయకత్వాలు చర్చించుకుని క్లారిటీ ఇచ్చాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటే ఫైనల్ అని డైరెక్ట్‌గా చెప్పేశాయి. ఆ తర్వాత అంతా సర్దుకుపోయిందని, అందుకే ఎక్కడా ఆధిపత్య ప్రదర్శన కనిపించడం లేదని అంతా భావిస్తున్నారు. కానీ… వాస్తవం మాత్రం వేరుగా ఉందట. టీడీపీ ఇన్చార్జ్‌లు సర్దుకుపోయి సైలెంట్‌ అవడం కాదు, వాళ్ళది ముందస్తు జాగ్రత్త అన్నది లేటెస్ట్ పొలిటికల్‌ టాక్‌. అందులో భాగంగానే జనసేన ఎమ్మెల్యేలతో కలిసి ఉమ్మడి వేదికలను పంచుకోవడం గానీ, కనీసం ఫోటోలు దిగేందుకు కూడా ఆసక్తి ప్రదర్శించడం లేదని చెప్పుకుంటున్నారు.

ఇప్పుడు పవర్, ప్రోటోకాల్ కోసం పోటీ పడటం కంటే …పార్టీ పెద్దల దగ్గర నెగెటివ్ రిమార్క్స్ పడకుండా చూసుకోవడమే ముఖ్యమని భావిస్తున్నారట. ఇటీవల కొందరు ఎమ్మెల్యేల తడబాట్లు, దుందుడుకు వైఖరి కారణంగా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్ధితులు ఎదురౌతున్నాయనే చర్చ జరుగుతోంది. భూముల వివాదాలు, మైనింగ్ వ్యవహారాలు రాజకీయంగా తీవ్ర రచ్చకు దారితీస్తున్నాయి. పంచధార్ల అక్రమ మైనింగ్ ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఆ విషయంలో బాధ్యులైన అధికారులపై వేటేసి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చిందన్నది పొలిటికల్‌ ఒపీనియన్‌. ఇదొక్కటే కాదు…. కోట్లాది రూపాయల విలువైన భూముల పంచాయితీలు, వాటి వెనుక నేతల ప్రమేయం ఆరోపణలు కూటమి పార్టీలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. వీటిలో కొన్నింటిని సొంత పార్టీ నేతలే పుట్టించి ప్రచారంలో పెడుతున్నారన్న కలవరపాటు సీనియర్ శాసనసభ్యుల్లో కూడా వ్యక్తం అవుతోంది. దీంతో ఆరోపణలు వచ్చిన వాటిపై విచారణ జరిపించాలని నేరుగా అధికారులకు లేఖలు రాయాల్సి వస్తోంది. ఇలా… రాను రాను రాజకీయ వాతావరణం సంక్లి ష్టంగా మారుతుండటంతో టీడీపీ ఇన్చార్జ్‌లు జాగ్రత్తపడుతున్నట్టు చెప్పుకుంటున్నాపు. వివాదాలన్నిటినీ సర్దుబాటు చేసుకుని ఒకవేళ ఎమ్మెల్యేలకు దగ్గరై… వాళ్ళతో అంటకాగితే…. ఆ ఆరోపణలు, నెగెటివిటీ భారాన్ని రేపు మేం కూడా మోయాల్సి వస్తుందని భయపడుతున్నారట టీడీపీ ఇన్ఛార్జ్‌లు. మరోవైపు స్ధానిక ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమవుతోంది. అది మొదలైతే… ప్రతి రోజూ ప్రజాక్షేత్రంలో వుండాల్సిందే. ఇలాంటి టైంలో…. ఏ చిన్న తప్పు జరిగినా తమ భవిష్యత్‌ అవకాశాలు ఘోరంగా దెబ్బతింటాయన్న భయం టీడీపీ ఇన్ఛార్జ్‌ల్లో పెరుగుతోందట. సహవాస దోషం కారణంగా నష్టం జరిగితే దాన్ని తిరిగి పూడ్చుకోవడం కష్టమన్న ఉద్దేశ్యంతోనే….జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే నేరుగా చెప్పకున్నా…. బాబోయ్‌… మీకో దండం…. మీరూ వద్దు, మీతో మాకు ఆధిపత్య పోరు వద్దు. కొన్నాళ్ళ పాటు మా మానాన మేం ఓ మూలన కూర్చుని మాడిపోయిన మసాలా దోశ తింటామంటూ దండం పెట్టేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu