పాకిస్తాన్.. అంటేనే అది హిందూ వ్యతిరేక దేశం అని గుర్తొస్తుంది. 1947 విభజన తర్వాత భారతీయ మూలాలను సమూలంగా తుడిచేసి, ఇస్లాం మయం చేసేసింది పాకిస్తాన్.
పాకిస్తాన్ లో వేల ఏళ్ల నాటి ప్రాచీన హిందూ దేవాలయాలు నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయి. అనేక చోట్ల ఆలయ భూములను అక్రమంగా ఆక్రమించి ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించారు. మరికొన్ని చోట్ల వందలాది ఆలయాలను మతతత్వ మూకలు కూల్చివేశాయి. గురు నానక్ పుట్టినగడ్డ సహా అనేక ముఖ్యమైన గురుద్వారాలు కాలక్రమేణా దెబ్బతిన్నాయి. సిక్కులు దేశం విడిచి వెళ్లడంతో, అటువంటి పవిత్ర స్థలాలు భద్రత లేక తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. పార్సీ కమ్యూనిటీ పాకిస్థాన్ వ్యాపార, సాంస్కృతిక రంగాల్లో కీలక పాత్ర పోషించింది. విభజన తర్వాత అది కనుమరుగైపోయింది. కరాచీ, లాహోర్ వంటి నగరాల్లో పార్సీలు నిర్మించిన క్లబ్బులు, విద్యాసంస్థలు, ఆస్పత్రుల పేర్లు కాలక్రమేణా మరుగున పడ్డాయి.
అయితే దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజల మనసుల్లో మాత్రం ఆ పేర్లు, ప్రాంతాలు చెరిగిపోలేదు. వాడుకలో ఉన్న పేర్లనే అక్కడి ప్రజలు పిలుచుకుంటూ వచ్చారు. కానీ అధికారిక రికార్డుల్లో మాత్రం ఆ పేర్లు ఉండేవి కావు. ఇప్పుడు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రభుత్వం ఆ పేర్లను పునరుద్ధరించేందుకు నడుం బిగించింది.
పాకిస్తాన్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ప్రభుత్వం చేపట్టిన ‘లాహోర్ హెరిటేజ్ రివైవల్ ప్రాజెక్ట్’ కింద, దశాబ్దాలుగా మరుగున పడిపోయిన చారిత్రక చిహ్నాలకు ప్రాణం పోస్తున్నారు. గత రెండు నెలల వ్యవధిలోనే సుమారు 9 ప్రధాన ప్రాంతాల పేర్లను ప్రభుత్వం మార్చేసింది. ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది ఇస్లాంపురాను ‘కృష్ణ నగర్’గా మార్చడం. అలాగే, సున్నత్ నగర్ ఇకపై ‘సంత్ నగర్’గా, ముస్తఫాబాద్ ‘ధర్మపుర’గా తమ పూర్వపు వైభవాన్ని దక్కించుకున్నాయి. లక్ష్మీ చౌక్ పేరును రికార్డుల్లో ‘మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్’గా మార్చేశారు. కానీ ప్రజలు మాత్రం ‘లక్ష్మీ చౌక్’ అనే పిలుచుకునేవారు. ప్రజా ఆకాంక్షలను గౌరవిస్తూ, ఇప్పుడు దానిని అధికారికంగా లక్ష్మీ చౌక్‌గా మార్చేశారు. అలాగే, గతంలో జైన్ మందిర్ చౌక్ పేరును బాబ్రీ మసీదు చౌక్ అని మార్చారు. తాజాగా దాన్ని రద్దు చేసి, తిరిగి ‘జైన్ మందిర్ చౌక్’గా పునరుద్ధరించారు. కేవలం పేర్ల మార్పుకే పరిమితం కాకుండా, క్రీడా రంగంలోనూ చారిత్రక వాస్తవాలను వెలికితీస్తున్నారు. మింటో పార్క్, గ్రేటర్ ఇక్బాల్ పార్క్‌లో ఉన్న పురాతన క్రికెట్ గ్రౌండ్లు, కుస్తీ అఖారాలను ఆధునీకరించే పని మొదలైంది. భారత దిగ్గజ క్రికెటర్ లాలా అమర్‌నాథ్, స్టార్ రెజ్లర్ గామా పహిల్వాన్ వంటి క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందిన విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా గుర్తు చేసుకుంటోంది.

