Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్

Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్

NTV Telugu 3 weeks ago

Pawan Kalyan: పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న పరిశ్రమలు, విద్యాసంస్థలు పన్నులు ఎగవేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

పంచాయతీలకు రావాల్సిన పన్నులు సక్రమంగా వసూలు చేస్తే గ్రామాల్లో మౌలిక సదుపాయాల సమస్యలు, ఉద్యోగుల జీతాల సమస్యలు, పారిశుధ్య సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. పంచాయతీల పరిధిలో పరిశ్రమలు, విద్యాసంస్థల పన్నుల ఎగవేతపై నిర్వహించిన కీలక సమీక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సామాన్య ప్రజలు క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నప్పుడు, భారీ ఆదాయాలు ఆర్జిస్తున్న పరిశ్రమలు, విద్యాసంస్థలు పన్నులు చెల్లించకుండా ఉండటం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

పన్ను ఎగవేతల కారణంగా పంచాయతీల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని, ఈ పరిస్థితిని ఇకపై సహించబోమని పవన్ హెచ్చరించారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు చెల్లిస్తున్న పన్నులపై పునఃఅంచనా (రీ అసెస్‌మెంట్) నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా పంచాయతీ అధికారులతో (డీపీవోలు) ప్రత్యేక ఎంపవర్డ్ కమిటీ ఏర్పాటు చేసి పంచాయతీల పరిధిలోని సంస్థలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. గత 30 ఏళ్లలో పంచాయతీలకు చెందిన ఎన్ని ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయనే అంశంపై కూడా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. తాళ్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చెట్టినాడ్ సిమెంట్స్ నుంచి పన్నులు వసూలు చేయడంలో జరిగిన అవకతవకలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నులు వసూలు చేయని సంబంధిత పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

పరిశ్రమలు, విద్యాసంస్థల కోసం వేర్వేరు గ్రేడ్లు, పన్ను స్లాబ్‌లు నిర్ణయించాలని పవన్ సూచించారు. విద్యాసంస్థలు భారీ ఫీజులు వసూలు చేస్తూ పన్నులు చెల్లించకుండా ఉండటం సరైన విధానం కాదన్నారు. ఉచిత విద్య అందిస్తున్న సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని పరిశీలించవచ్చని, కానీ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే సంస్థలు పన్నులు తప్పించుకోవడం అంగీకరించలేమన్నారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వంటి కొన్ని పరిశ్రమలు కాలుష్యాన్ని గోదావరిలోకి విడుదల చేస్తూనే స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పన్నులను ఎగవేస్తున్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీగా పనిచేయాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం పరిశ్రమల నుంచి సుమారు రూ.115.57 కోట్ల పన్ను బకాయిలు, విద్యాసంస్థల నుంచి రూ.45 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని సమావేశంలో వెల్లడైంది. మొత్తం మీద పంచాయతీలకు రావాల్సిన బకాయిలు రూ.160 కోట్లకు పైగా ఉన్నాయని అధికారులు వివరించారు. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థల్లో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు రాష్ట్రవ్యాప్తంగా రూ.88 కోట్ల అవసరం ఉందని, కేవలం బకాయిల్లో సగం మొత్తం వసూలు చేసినా ఆ సమస్యను పరిష్కరించవచ్చని పవన్ పేర్కొన్నారు. ఒక్క ఆంధ్ర పేపర్ మిల్స్ సంస్థే సుమారు రూ.13 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పన్నుల చెల్లింపులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, పల్స్ సర్వే తరహాలో నాలుగు రోజులపాటు విస్తృత తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పన్నులు ఎగవేస్తున్న సంస్థల వివరాలను ప్రజలకు తెలియజేయాలని, రాజకీయ ఒత్తిళ్లు ఉంటే ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు. పంచాయతీలకు రావాల్సిన పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేయగలిగితే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు సుమారు రూ.5,496 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, ఉద్యోగుల జీతాలు వంటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu