Dailyhunt
Pawan Kalyan : విజయ్'ని మనసారా అభినందిస్తున్నా

Pawan Kalyan : విజయ్'ని మనసారా అభినందిస్తున్నా

NTV Telugu 1 week ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి) ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు.

ఓటర్ల చైతన్యాన్ని అభినందిస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యమని ఆయన పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలు ఓటర్ల విజ్ఞతను చాటుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారని, పాలన నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా మార్పును ఆహ్వానిస్తారని ఈ ఫలితాలు నిరూపించాయని ఆయన అభిప్రాయపడ్డారు.పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన విజయంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించారు. బెంగాల్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన కృషి శ్లాఘనీయమని కొనియాడారు. మోదీ నాయకత్వంలో బెంగాల్ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందని ప్రజలు నమ్మారని, అందుకే బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్, సువేందు అధికారికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

అసోం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ వరుసగా విజయాన్ని అందుకున్న ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మకి అభినందనలు తెలిపారు. పుదుచ్చేరిలో ఎన్.డి.ఎ. కూటమికి మళ్ళీ విజయాన్ని అందించిన ముఖ్యమంత్రి రంగసామిని అభినందించారు. తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ మార్పు గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో విజయ్ స్థాపించిన టి.వి.కె. పార్టీకి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే ఇంతటి ఘనవిజయం సాధించడం గొప్ప విషయమని విజయ్ ని మనసారా అభినందించారు. కేరళ ప్రజలు కూడా ఈసారి మార్పునే కోరుకున్నారని, అక్కడ విజయం సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూ.డి.ఎఫ్. (UDF) కూటమికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu