PM Modi Reaction: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) కంచుకోటను బద్దలు కొట్టి, బీజేపీ సాధించిన ఈ ఘన విజయంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ప్రజల శక్తికి నిదర్శనం
'పశ్చిమ బెంగాల్‌లో కమలం వికసించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇది ప్రజల శక్తికి దక్కిన విజయం. బీజేపీ అనుసరిస్తున్న సుపరిపాలన రాజకీయాలకు ప్రజలు పట్టం కట్టారు' అని ప్రధాని పేర్కొన్నారు. బెంగాల్‌లోని ప్రతి ఒక్క పౌరుడికి తాను తలవంచి నమస్కరిస్తున్నట్లు ఆయన భావోద్వేగంతో తెలిపారు. ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని ఈ సందర్భంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. 'బెంగాల్ ప్రజల కలలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవం దక్కేలా అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం' అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరో పోస్ట్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఈ చారిత్రాత్మక విజయం అకస్మాత్తుగా వచ్చింది కాదు. కొన్ని తరాలుగా ఎంతోమంది కార్యకర్తలు చేసిన పోరాటం, పడ్డ కష్టం దీని వెనుక ఉంది. క్షేత్రస్థాయిలో ఎన్నో సవాళ్లు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అభివృద్ధి అజెండాను ప్రజల దగ్గరకు తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకూ నేను సెల్యూట్ చేస్తున్నాను. వారే మా పార్టీ అసలైన బలం' అని కొనియాడారు. ఈ గెలుపుతో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ శ్రేణులు పండుగ వాతావరణంలో మునిగిపోయారు. కోల్‌కతా నుంచి ఢిల్లీ వరకు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

