Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ

Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ

NTV Telugu 3 weeks ago

Ponguleti Srinivas Reddy: తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించి రాష్ట్రంలో భూముల సమస్యలు, ధరణి పోర్టల్ అక్రమాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ , కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ , అసైన్డ్ భూముల కేటాయింపుల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించిన మంత్రి, అసైన్డ్ భూముల విషయంలో త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. మెదక్, కామరెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని అసైన్డ్ భూముల లెక్కలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు.

ధరణి, భూ భారతి అక్రమాలపై ‘సెట్’ విచారణ

ధరణి మొదటి టెండర్ నుండి ‘భూ భారతి’ వరకు జరిగిన భూ లావాదేవీలు, అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SET) విచారణ జరుపుతుందని మంత్రి వెల్లడించారు. ‘భూ భారతి’ని కేవలం నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC)కి మాత్రమే అప్పగించామని, వాళ్లు ఎవరికైనా ఇస్తే ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా భూ అక్రమాలు పూర్తిగా బయటకు రాలేదని, అందుకే ‘సెట్’ వేయాల్సి వచ్చిందన్నారు. ప్రోహిబిటెడ్ లిస్ట్‌లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత పెట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేసింది అనే అంశాలపై సెట్ లెక్కలు తీస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రోహిబిటెడ్ లిస్ట్‌లోని ఒక్క భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేయలేదని తెలిపారు. భూ అక్రమాల్లో ఎంఆర్‌ఓల పాత్ర ఎక్కువగా ఉందని, కొందరి వల్ల తెలిసి జరిగితే మరికొందరి వల్ల తెలియక జరిగాయని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో రీ-సర్వే చేపట్టడం ద్వారా 90 శాతానికి పైగా భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయన్నారు.

అవినీతి కట్టడికి చర్యలు.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ

రెవెన్యూ శాఖలో అవినీతిని కట్టడి చేసేందుకు సర్వప్రయత్నాలు చేస్తున్నానని మంత్రి చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలను కట్ చేస్తేనే అవినీతికి అడ్డుకట్ట వేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని, మరో నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ ప్లాట్‌ఫామ్ కిందికే రిజిస్ట్రేషన్ల వ్యవస్థ రాబోతోందని ప్రకటించారు. ఇక గత ప్రభుత్వం నిర్మించిన , ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను రాబోయే రెండు నుండి మూడు నెలల్లో అర్హులకు పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో నిర్మించిన ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని ఆగస్టు 15వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

పార్టీ-ప్రభుత్వం మధ్య అనుబంధం.. ‘అన్నదమ్ముల పంచాయతీ’

కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి , గాంధీ భవన్ వర్గాలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఒక మహా సముద్రమని, అందులో చిన్న చిన్న సమస్యలు రావడం సహజమని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్నది కేవలం అన్నదమ్ముల పంచాయతీ మాత్రమేనని, ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండటం సహజమని, దాన్ని విభేదాలు అనడం సరికాదన్నారు. కో-ఆర్డినేషన్ కమిటీ మొదటి సమావేశం కాబట్టే ఢిల్లీలో జరిగిందని వివరణ ఇచ్చారు. తమ అంతర్గత పంచాయతీలోకి ఇతరులు దూరి రాజకీయాలు చేస్తే వారికే నష్టమని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu