Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Psychology Facts: 'లైట్ తీసుకో, పట్టించుకోకు..' ఈ మాటలతో నష్టమే ఎక్కువ!

Psychology Facts: 'లైట్ తీసుకో, పట్టించుకోకు..' ఈ మాటలతో నష్టమే ఎక్కువ!

NTV Telugu 1 week ago

లైట్ తీసుకో.. ఎక్కువగా ఆలోచించకు.. పాజిటివ్‌గా ఉండు.. అందరికీ సమస్యలుంటాయి.. మర్చిపో…! ఎవరైనా తమ బాధను చెప్పినప్పుడు, చాలామంది నోటి నుంచి ముందుగా వచ్చే మాటలు ఇవే.

అయితే ఆ మాటలు వింటున్న వ్యక్తి బాధను మాత్రం చాలా మంది లోతుగా ఆలోచించరు. వారి లోపల ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే కథ మొత్తం మారిపోతుంది.

ఒక వ్యక్తి రాత్రి నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారనుకోండి.. ఉదయం జరిగిన ఒక ఘటన పదేపదే గుర్తొస్తోందనుకోండి.. చివరికి ఎవరికైనా ఫోన్ చేసి తమ బాధను చెప్పుకుంటారు. అవతల నుంచి వెంటనే ఒక మాట వస్తుంది. లైట్ తీసుకో.. ఆ వ్యక్తి ఫోన్ పెట్టిన తర్వాత ఇంకోసారి అదే విషయం గురించి ఆలోచిస్తారు.


ఈసారి సమస్యతో పాటు ఇంకో ప్రశ్న కూడా చేరుతుంది. నేను ఇంతగా ఎందుకు బాధపడుతున్నాను? ఇతరులకు ఇది చిన్న విషయంలా కనిపిస్తుంటే, నా మనసు ఎందుకు ఇంతగా ఆలోచిస్తుంది? ఇక్కడే చాలామంది తరచూ చేసే ఒక పొరపాటు కనిపిస్తుంది. బాధను తగ్గించాలని ప్రయత్నిస్తూ, ముందుగా ఆ బాధ పరిమాణాన్ని నిర్ణయించేస్తారు. ఇది అంత పెద్ద విషయం కాదు.. అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు.. ఇంకొంచెం ధైర్యంగా ఉంటే సరిపోతుంది లాంటి మాటలు అందుకే ముందుగా వస్తాయి. బాధకు కొలతలు వేసి లెక్కగట్టడానికి అది ఏమైనా డ్రెస్‌ సైజా? ఆందోళన అనేది మనిషి కావాలని ఎంచుకున్న ఆలోచనా విధానం కాదు కదా. అందుకే యాంగ్జైటీ పెరిగినప్పుడు మెదడు ఒక సమస్యను ప్రమాదంగా గుర్తించి, దానిపైనే దృష్టిని నిలబెట్టుకోవచ్చు. అదే విషయం పదేపదే గుర్తుకు రావచ్చు.

శరీరం కూడా స్పందిస్తుంది. గుండె వేగం పెరగడం, కండరాలు బిగుసుకోవడం, శ్వాసలో మార్పు, చెమట, నిద్రలో అంతరాయం, ఏకాగ్రత తగ్గడం లాంటివి కనిపించవచ్చు. అందుకే ఎక్కువగా ఆలోచించకు అనే మాట, ఆలోచనలతో పోరాడుతున్న వ్యక్తి దగ్గర అనడం వారి సమస్యను రెట్టింపు చేస్తుంది. ఉదాహరణకు జ్వరం వచ్చినవాడి దగ్గరకు వెళ్లి..జ్వరంపడకు అని చెప్పలేం కదా.. ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ ఆలోచనను ఆపాలని ఎంతగా ప్రయత్నిస్తే, అదే ఆలోచన మీద దృష్టి మరింత నిలిచిపోవచ్చు.

మనసుకు ఓ విషయం గురించి ఆలోచించకూడదని చెప్పినప్పుడు, అదే విషయం మన ముందుకు మళ్లీ వస్తుంది. సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు అతిగా ఆలోచించకు అని చెప్పడం కంటే.. ఇప్పుడు నీ తలలో ఎక్కువగా తిరుగుతున్న ఆలోచన ఏంటి అని అడగడం కొన్నిసార్లు మరింత ఉపయోగపడుతుంది. ఇక డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తికి పాజిటివ్‌గా ఉండు అని చెప్పడం కూడా విడ్డూరమే. కొంతమందిలో నిరాశతో పాటు శక్తి తగ్గడం, నిద్రలో మార్పులు, ఏకాగ్రత తగ్గడం, ఆసక్తి కోల్పోవడం, నిస్సహాయత వంటి అనుభవాలు ఉంటాయి.

అలాంటి సమయంలో పాజిటివ్‌గా ఆలోచించు అనే మాట, సమస్యను పరిష్కరించడానికి బదులు, బాధపడుతున్న వ్యక్తికి మరో బాధను ఇవ్వొచ్చు. నాకు పాజిటివ్‌గా ఉండడం కూడా చేతకావడం లేదనే భావన రావచ్చు. అంటే సమస్యతో పాటు తన మీదే ఒక తీర్పు మొదలవుతుంది. ఇక్కడే అవతలివారి మాటను వినడమే చాలా ముఖ్యమవుతుంది.

సైకాలజీలో ఎమోషనల్ వాలిడేషన్ అనే భావన ఉంది. దాని అర్థం ఎదుటివారు చెబుతున్న ప్రతి విషయంలోని భావనను గౌరవించడం. వాళ్లకు ఎందుకు అలా అనిపిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. ఒక వ్యక్తి నాకు చాలా భయంగా ఉంది అని అంటే భయపడాల్సిన అవసరం లేదు అని వెంటనే చెప్పడం కంటే, ‘ఇది నీకు చాలా భయంగా అనిపిస్తోంది కదా.. అసలు ఏ విషయం ఎక్కువగా భయపెడుతోంది?’ అని అడగడం వేరే అనుభూతిని ఇస్తుంది.

సమస్య అప్పటికప్పుడే పరిష్కారం కాదు కానీ ఆ బాధను నిరూపించుకోవాల్సిన అవసరం మాత్రం తగ్గుతుంది. ఇంకో సాధారణమైన మాట. ‘అందరికీ సమస్యలుంటాయి..’ నిజమే. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. కానీ ఆ నిజం ఒక వ్యక్తి అనుభవిస్తున్న బాధను చిన్నదిగా చేయదు. ఇద్దరికి ఒకే సంఘటన జరిగినా, వాళ్ల మానసిక స్థితి, గత అనుభవాలు, భయాలు, పరిస్థితులు వేరుగా ఉండొచ్చు. అందుకే ఇతరులతో కంపేర్ చేసి బాధను కొలవద్దు.

ఇక్కడ మరో విషయం చాలా ముఖ్యమైనది. ఎవరైనా ఒకే బాధను మళ్లీ మళ్లీ చెబుతుంటే మనకు చిరాకు రావచ్చు. మొదటిసారి వింటాం. రెండోసారి వింటాం. మూడోసారి వింటాం. ఒక దశలో ఇదే విషయాన్ని ఇంకా ఎన్నిసార్లు చెబుతారు? అని అనిపించవచ్చు. వినే వ్యక్తి కూడా అలసిపోవడం సహజమే. కానీ ఒక బాధను పదేపదే చెప్పడం ప్రతిసారీ మొండితనం కాదు. కొన్నిసార్లు మనిషి ఒక సంఘటనను అర్థం చేసుకోవడానికి దాని గురించి మళ్లీ మాట్లాడుతుంటారు.

మొదటిసారి సంఘటన గుర్తొస్తుంది. తర్వాత దాని వల్ల కలిగిన కోపం. మరోసారి దాని వెనుక దాగి ఉన్న భయం. ఆ తర్వాత అసలు బాధ. అందుకే అదే కథ మళ్లీ వినిపించినప్పటికీ, దాని లోపల ఉన్న భావం ప్రతిసారీ ఒకేలా ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఒక పరిమితి ఉంది. వినడం అంటే అంతులేకుండా ఒకే బాధలోనే ఉండిపోవడం కాదు.. మాట్లాడటం రోజువారీ జీవితాన్ని మరింత దెబ్బతీస్తుంటే, నిద్ర పూర్తిగా మారిపోతే, పని లేదా చదువు చేయడం కష్టమైతే, నిరాశ తీవ్రంగా పెరుగుతుంటే, లేదా తనకు తాను హాని చేసుకోవాలనే ఆలోచనలు వస్తే, స్నేహితుడి ఓదార్పు దగ్గర ఆగిపోకుండా మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం తీసుకోవాలి.

ఎందుకంటే ప్రతి మానసిక బాధను మనం స్నేహంతో పరిష్కరించలేం కానీ మనం ఒకరినొకరు ఒంటరిగా అనిపించకుండా చేయగలం. అదే మనం మాట్లాడే విధానంలో మొదలవుతుంది. ఎవరైనా ఏడుస్తున్నప్పుడు వెంటనే కారణం వెతకాల్సిన అవసరం లేదు. ఎవరైనా భయపడుతున్నప్పుడు వెంటనే ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా నిరాశలో ఉన్నప్పుడు వెంటనే జీవితంపై ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక ప్రశ్న చాలు. ఇప్పుడు నీకు ఏం అనిపిస్తోంది? కొన్నిసార్లు నేను వింటున్నాను అనే ఒక మాట చాలు. మరికొన్నిసార్లు మాటలే అవసరం ఉండదు. పక్కన కూర్చునే మనిషి చాలు. ఎందుకంటే మానసిక బాధలో ఉన్న వ్యక్తికి ప్రతి సమస్యకు పరిష్కారం వెంటనే దొరకకపోవచ్చు కానీ తన బాధను చెప్పుకున్నందుకు జడ్జ్‌ చేయడంలేదనే నమ్మకం దొరకొచ్చు.

అందుకే ఇక లైట్ తీసుకో అని చెప్పే ముందు ఒక్కసారి ఆగండి. ఎక్కువగా ఆలోచించకు అని చెప్పే ముందు వాళ్లు ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారో అడగండి. పాజిటివ్‌గా ఉండు అని చెప్పే ముందు వాళ్లు ప్రస్తుతం ఎంత చీకటిలో ఉన్నారో వినండి. బాధను చిన్నదిగా చేయడం ద్వారా మనిషిని బలంగా చేయలేం. కొన్నిసార్లు ఆ బాధను జడ్జ్‌ చేయకుండా వినడం ద్వారా వారికి సాయం చేయగలం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu