Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Purusha: 350 సినిమాలకు టైటిల్స్ డిజైన్ చేసి.. ఇప్పుడు దర్శకుడిగా!

Purusha: 350 సినిమాలకు టైటిల్స్ డిజైన్ చేసి.. ఇప్పుడు దర్శకుడిగా!

NTV Telugu 1 week ago

సినిమా పోస్టర్ల మీద టైటిల్స్ రాస్తూ కెరీర్ ప్రారంభించి.. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో-డైరెక్టర్‌గా ఎదిగి.. ఇప్పుడు ఏకంగా దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు వీరు వులవల.

ఆయన దర్శకత్వం వహించిన తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పురుష:’. బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం అవుతున్నారు. మే 22న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో.. దర్శకుడు వీరు వులవల మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

“నాకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ వేయడం అలవాటు. హీరోల బొమ్మలు, థియేటర్ల ముందు బ్యానర్లు వేసేవాడిని. ఆ తర్వాత బీఎఫ్ఏ చేసి ఇండస్ట్రీకి వచ్చా. ‘కొత్త బంగారు లోకం’ సినిమాకు తొలిసారి టైటిల్ డిజైన్ చేశా. అలా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి చిత్రాలతో సహా ఇప్పటివరకు 350కి పైగా సినిమాలకు టైటిల్స్ రాసి డిజైన్ చేశాను. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి వద్ద ‘మళ్లీరావా’, ‘జెర్సీ’ చిత్రాలకు, అలాగే రీసెంట్‌గా వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మసూద’ సినిమాకు దర్శకత్వ శాఖలో పని చేశాను. ‘జెర్సీ’ టైమ్‌లోనే నాకు ఈ ‘పురుష:’ కథ తట్టింది” అని వీరు వులవల తన సినీ ప్రయాణాన్ని వివరించారు.

“మనం ఎక్కువగా ఫీమేల్ ఓరియెంటెడ్ కథలు చూస్తుంటాం. కానీ ఒక భార్యాభర్తల కథను కంప్లీట్ మేల్ ఓరియెంటెడ్‌గా (పురుషులందు పుణ్య పురుషులు వేరయా.. అనే పాయింట్‌తో) తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలోంచి పుట్టిందే ఈ సినిమా. ఇందులో గోవింద్ (పవన్ కళ్యాణ్), కమల (రాయంచ) లవ్ స్టోరీ మెయిన్ పాయింట్. ప్రేమ కోసం ఏమైనా చేసే మంచి పాత్రలో హీరో కనిపిస్తాడు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్తో వచ్చే ఓ ‘కిటికీ ఎపిసోడ్’ సినిమాకే హైలైట్. ఆ సీన్‌లో థియేటర్లో ఆడియన్స్ పగలబడి నవ్వుతారు” అని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. “నిర్మాత కోటేశ్వరరావు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. అవుట్‌పుట్ చూసిన తర్వాత ఆయన నన్ను పట్టుకుని ఏడ్చేశారు. ‘ఇది నా 26 ఏళ్ల కల’ అని కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ కంప్లీట్ ఎంటర్‌టైనర్ ఇది” అని దర్శకుడు ముగించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu