Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rahul Dravid: "హీరోలు లేకుండా క్రీడ ఉండదు".. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..

Rahul Dravid: "హీరోలు లేకుండా క్రీడ ఉండదు".. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..

NTV Telugu 1 week ago

Rahul Dravid: భారత క్రికెట్‌లో ‘సూపర్‌స్టార్ సంస్కృతి’ (వ్యక్తిగత కల్ట్) అంతం కావాలంటూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తరచూ చేసే వ్యాఖ్యలపై మాజీ ప్రధాన కోచ్, దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ ఆసక్తికరమైన రీతిలో స్పందించాడు.

జట్టులో ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు, ఘనతలను అతిగా సెలబ్రేట్ చేయడం ఆపేసి.. జట్టు విజయాలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని గంభీర్ గట్టిగా వాదిస్తుంటాడు. గంభీర్ ఆలోచనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్తూనే, ద్రావిడ్ ఒక కీలక విషయాన్ని లేవనెత్తాడు. ఏ క్రీడకైనా ఖచ్చితంగా ‘హీరోలు’ అవసరమని, జట్టు విజయాల్లో వ్యక్తిగత ప్రతిభ, వారికి దక్కే ప్రశంసలు సైతం అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ద్రావిడ్ స్పష్టం చేశాడు.

సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ఎందరో దిగ్గజ సూపర్‌స్టార్లతో కలిసి ఆడి, భారత క్రికెట్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ద్రావిడ్.. ‘విజ్డెన్ ఆన్ ది స్కూప్’ పాడ్‌కాస్ట్‌లో ఈ అంశంపై మాట్లాడాడు. “ఏ క్రీడకైనా హీరోలు అవసరం. మైదానంలో అద్భుతమైన ప్రదర్శనలు చేయకుండా ఎవరూ హీరోలు కాలేరని నేను భావిస్తున్నాను. మీరు రాణించకుండా దేశ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోలేరు. ముఖ్యంగా భారతదేశంలో మీరు బాగా ఆడితే ఎంతలా నెత్తిన పెట్టుకుంటారో, విఫలమైతే అంతేలా విమర్శిస్తారు. ఇక్కడ ఎప్పుడూ ఆటగాళ్లపై నిరంతర నిఘా, తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అలాంటి వాతావరణంలో భారత్‌లో ఒకరు లెజెండ్ లేదా సూపర్‌స్టార్ అయ్యారంటే.. వారు ఎన్నో విషయాలను సరిగ్గా చేశారని అర్థం. ఆ ప్రక్రియలో వారు తమ జట్టు విజయాలకు సైతం ఎంతో సహాయపడినట్లే” అని ద్రావిడ్ గంభీర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.

ఇక, గౌతమ్ గంభీర్ కోచింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవలి కాలంలో భారత టెస్ట్ జట్టు ప్రదర్శన అంత ఆశాజనకంగా లేదు. గంభీర్ ఆధ్వర్యంలో టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతుల్లో క్లీన్‌స్వీప్ (వైట్‌వాష్) అవమానాలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో భారత టెస్ట్ క్రికెట్ స్థితిగతులపై కూడా ద్రావిడ్ స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆర్‌ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదని, అయినప్పటికీ జట్టు త్వరలోనే పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. “రెడ్-బాల్ (టెస్ట్) క్రికెట్‌లో రాణించాలనే కసి జట్టులో ఖచ్చితంగా ఉంది. భారత జట్టుగా గత రెండు సిరీస్‌లలో మేం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం, క్రికెట్‌లో అలా జరగడం సహజం. ఇటీవల రిటైర్ అయిన రోహిత్, విరాట్, అశ్విన్ వంటి కొందరు పెద్ద తలకాయలు జట్టులో లేకపోవడం పెద్ద లోటే. అలాంటి మేటి ఆటగాళ్ల స్థానాలను రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. కానీ భారత క్రికెట్ పునాదులు ఇప్పటికీ చాలా బలంగా ఉన్నాయి. టీమిండియా ఆడే ప్రతీ ఫార్మాట్‌లోనూ గట్టి పోటీ ఇస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. దీనికి కొంచెం సమయం పట్టవచ్చు, కానీ ఈ సీజన్‌లోనే జట్టు మళ్లీ గాడిన పడుతుందని ఆశిస్తున్నాను” అని ద్రావిడ్ పేర్కొన్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu