Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!

Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!

NTV Telugu 1 week ago

Rainy Season Electrical Safety Tips: వర్షాకాలం వస్తోందంటే చాలు.. చల్లటి వాతావరణం, వేడి వేడి పకోడీలు గుర్తొస్తాయి. కానీ, అదే సమయంలో మన ఇంట్లో అత్యంత ప్రమాదకరంగా మారేది ఎలక్ట్రికల్ వైరింగ్.

వర్షాల వల్ల గోడలు నానడం, తేమ పెరగడం వల్ల కరెంట్ షాక్‌లు, షార్ట్ సర్క్యూట్‌లు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఎలక్ట్రిసిటీ విషయంలో మనం చేసే ఒక చిన్నపాటి నిర్లక్ష్యం.. ప్రాణాలకే ముప్పు తెచ్చే పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. అందుకే, వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంటి ఎలక్ట్రికల్ వైరింగ్‌ని ఎలా సేఫ్‌గా ఉంచుకోవాలో ఈ క్రింది జాగ్రత్తలు చూసి ముందే అలర్ట్ అవ్వండి..

1. లూజ్ కనెక్షన్లు, పాత వైర్లకు చెక్ పెట్టండి..
మన ఇంట్లో చాలా కాలంగా వాడుతున్న పాత వైర్లు , ఎక్కడైనా లూజ్ కనెక్షన్లు ఉంటే వాటిని అస్సలు లైట్ తీసుకోవద్దు. వర్షాలు పడకముందే ఒక మంచి ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి ఇంటి వైరింగ్‌ మొత్తాన్ని ఒకసారి తనిఖీ చేయించుకోండి. ఎక్కడైనా వైర్లు పగిలిపోయి (Cuts) ఉన్నా, సాకెట్లు లూజ్‌గా ఉన్నా వెంటనే రిపేర్ చేయించడం చాలా ముఖ్యం.

2. నానిన గోడలు.. కరెంట్ షాక్ ప్రమాదం
వర్షాకాలంలో చాలా ఇళ్లలో గోడలు తేమను గుంజుకుని నానిపోతుంటాయి. ఒకవేళ ఆ గోడల గుండా ఎలక్ట్రికల్ వైరింగ్ పైపులు వెళ్తుంటే.. వైర్లు పాతవి కావడం వల్ల కరెంట్ లీకేజ్ జరిగి గోడ మొత్తం 'ఎర్త్' (కరెంట్ షాక్) వచ్చే ప్రమాదం ఉంది. పొరపాటున ఆ గోడను తాకినా, అక్కడ ఉండే స్విచ్ బోర్డులను తడి చేతులతో ముట్టుకున్నా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అందుకే గోడలు నానకుండా ముందే లీకేజ్ పనులు చూసుకోవాలి.

3. ఇంటి బయటి స్విచ్ బోర్డులకు రక్షణ కవచం
ఇంటి కాంపౌండ్ వాల్ దగ్గర, గేటు పక్కన, బాల్కనీల్లో.. ఇలా ఇంటి బయట ఓపెన్‌గా ఉండే స్విచ్ బోర్డులు, బల్బుల వైర్లపై వర్షపు నీరు పడే అవకాశం ఎక్కువ. నీరు పడగానే అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లంతా పవర్ కట్ అవ్వడమే కాకుండా మంటలు చెలరేగవచ్చు. అందుకే, బయట ఉండే బోర్డులపై వర్షం నీరు పడకుండా ప్రత్యేకంగా వాటర్‌ప్రూఫ్ ప్లాస్టిక్ బాక్సులను (Protective Covers) ఏర్పాటు చేయండి.

4. అప్లయన్సెస్ పట్ల అప్రమత్తత
రెగ్యులర్‌గా వాడే వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, మైక్రోవేవ్ ఓవెన్ వంటి వస్తువులకు ప్రాపర్ 'ఎర్తింగ్' (Earthing) ఉందో లేదో చూసుకోవడం చాలా అవసరం. వర్షాకాలంలో ఈ వస్తువుల బాడీలకు కరెంట్ పాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే, వర్షం పడుతున్నప్పుడు ఇంటి బయట ఉండే వాటర్ మోటార్ స్విచ్‌లు ఆన్ చేసేటప్పుడు కాళ్లకు చెప్పులు తప్పనిసరిగా ఉండాలి.

5. మెరుపులు, ఉరుములు వస్తున్నప్పుడు..
భారీ వర్షంతో పాటు పిడుగులు, మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లోని టీవీ, కంప్యూటర్, హోమ్ థియేటర్, ఫ్రిజ్ లాంటి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువుల ప్లగ్‌లను సాకెట్ల నుండి పూర్తిగా తీసేయడం (Unplug చేయడం) మంచిది. ఎందుకంటే ఆ సమయంలో పవర్ లైన్లలో ఒక్కసారిగా హై-వోల్టేజ్ వచ్చి, వస్తువులు కాలిపోవడమే కాకుండా బోర్డులు పేలిపోయే ప్రమాదం ఉంది.

లాస్ట్ మాట… “నిప్పుతోనైనా ఆడుకోవచ్చు కానీ కరెంట్‌తో కాదు” అంటారు పెద్దలు. వర్షాకాలం పూర్తిగా మొదలవ్వక ముందే ఈ చిన్న చిన్న తనిఖీలు పూర్తి చేసుకోండి. మీ నిర్లక్ష్యం మీ కుటుంబానికి శాపంగా మారకుండా ముందే జాగ్రత్తపడండి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu