Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ramani Kalyanam Review : రమణి కళ్యాణం రివ్యూ

Ramani Kalyanam Review : రమణి కళ్యాణం రివ్యూ

NTV Telugu 3 days ago

మర్షియల్ హంగులకు దూరంగా, 'నడవలేని ఒక అబ్బాయి, చూపులేని ఒక అమ్మాయి' మధ్య సాగే సరికొత్త ఎమోషనల్ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'రమణి కళ్యాణం'.

సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ జంటగా నటించిన ఈ సినిమాను విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై నిర్మించారు. మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, ప్రీమియర్ షో ద్వారా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం

రమణి కళ్యాణం కథ:
సంజన (దీప్షిక) చిన్నతనంలోనే జరిగిన ఒక ప్రమాదంలో కంటిచూపు కోల్పోతుంది. అయినప్పటికీ, తానొక అంధురాలినని ఎక్కడా కుంగిపోకుండా, ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తుంటుంది. కిషోర్ (శ్రీనివాస రెడ్డి) నడుపుతున్న పబ్‌లో సింగర్‌గా, అలాగే ఒక ఎఫ్‌ఎమ్ రేడియోలో ఆర్జేగా పని చేస్తూ.. నలుగురు పిల్లలు, ఒక బామ్మతో కూడిన తన కుటుంబాన్ని పోషిస్తుంటుంది. మరోవైపు, కిషోర్ స్నేహితుడైన రాజ్ (సూర్య వసిష్ఠ) కాళ్లు పడిపోయి వీల్ చైర్‌కే పరిమితమవుతాడు. తన గతాన్ని, ఆశయాలను తలుచుకుంటూ డిప్రెషన్‌లో ఉన్న రాజ్ జీవితంలోకి సంజన ప్రవేశిస్తుంది. మొదట్లో చిన్న గొడవతో ప్రారంభమైన వీరి పరిచయం, ఆ తర్వాత ఒకరిపైకొకరికి ఉన్న గౌరవంతో ప్రేమగా మారుతుంది. సంజన అందించిన స్ఫూర్తితో రాజ్ తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనుకుంటాడు. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్న తరుణంలో కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అసలు రాజ్ వీల్ చైర్‌కే ఎందుకు పరిమితమయ్యాడు? సంజనతో ఉన్న ఆ నలుగురు పిల్లలు ఎవరు? చివరికి వీరి కల్యాణం జరిగిందా లేదా? అనేదే మిగతా కథ.

విశ్లేషణ: ట్రైలర్, టీజర్లతోనే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం, వెండితెరపై కూడా అదే వైవిధ్యాన్ని, స్వచ్ఛతను చూపించే ప్రయత్నం చేసింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ప్రధాన పాత్రల పరిచయం, వారి మధ్య చిగురించే ప్రేమ చుట్టూ చాలా క్యూట్‌గా, ఫీల్ గుడ్‌గా సాగుతుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ఒక భావోద్వేగ సన్నివేశం ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా మారుతుంది. వీరి పెళ్లి జరుగుతుందా లేదా అనే ఉత్కంఠను దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి స్క్రీన్‌పై బాగానే ఎగ్జిక్యూట్ చేశారు. ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్ సీన్లు మరింత హృదయవిదారకంగా ఉండి, కంటతడి పెట్టిస్తాయి. మనుషులకు శారీరక లోపాలు ఉన్నా, వాటిని అధిగమించి జీవితంలో ముందుకు సాగాలనే మంచి సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే చూపులేని అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. కొన్ని సీన్లలో నిజంగానే ఆమెకు కళ్లు లేవా? అనేంత సహజత్వాన్ని ప్రదర్శించి సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. సూర్య వసిష్ఠ సినిమా అంతా వీల్ ఛైర్‌కే పరిమితమైన సవాలుతో కూడిన పాత్రలో అద్భుతమైన హావభావాలు పండించాడు. కళ్లతోనే ఎమోషన్స్‌ను క్యారీ చేశాడు. ఎప్పుడూ కామెడీ పాత్రలతో నవ్వించే శ్రీనివాస రెడ్డి, చాలా కాలం తర్వాత ఒక చక్కటి సీరియస్ అండ్ ఎమోషనల్ పాత్రలో కనిపించి మెప్పించారు. యాంకర్ శ్యామల, లోహిత్ కుమార్, చైతన్య జొన్నలగడ్డ, ప్రభావతి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఇటువంటి సున్నితమైన కథాంశాన్ని డీల్ చేయడంలో దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి మంచి ప్రతిభే కనబరిచారు. ఎక్కడా మెలోడ్రామా అవ్వకుండా బ్యాలెన్స్ చేశారు. విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథలోని ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేసింది. అయితే, పాటలు యావరేజ్‌గా ఉన్నాయి. యువరాజ్ అందించిన స్క్రీన్ ప్లే బాగుంది. అలానే కోర్టు డైరెక్టర్ రామ్ జగదీశ్ డైలాగ్స్ పోయటిక్ గా ఉన్నాయి. అయితే కొన్ని ల్యాగ్ సీన్స్‌పై, నిడివిపై ఎడిటింగ్ విభాగం మరింత దృష్టి పెట్టాల్సింది. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా చాలా బాగున్నాయి.

ఫైనల్లీ: 'రమణి కళ్యాణం' శారీరక వైకల్యాలు ఉన్న ఇద్దరు మనసుల మధ్య సాగే స్వచ్ఛమైన, ఎమోషనల్ ప్రేమకథ. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu