Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rohit Sharma: నువ్వు నిజమైన లెజెండ్.. తెర వెనుక ఎంతగానో కష్టపడ్డావ్.. రోహిత్ భావోద్వేగ పోస్ట్!

Rohit Sharma: నువ్వు నిజమైన లెజెండ్.. తెర వెనుక ఎంతగానో కష్టపడ్డావ్.. రోహిత్ భావోద్వేగ పోస్ట్!

NTV Telugu 1 week ago

భారత క్రికెట్ జట్టుకు ఐదేళ్ల పాటు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించిన టీ దిలీప్‌ ఇటీవల తన బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. జింబాంబ్వే సిరీస్ అనంతరం బీసీసీఐ ఒప్పందాన్ని పునరుద్ధరించకపోవడంతో భారత జట్టు సహాయక సిబ్బంది నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

శుభదీప్ ఘోష్‌ను కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా బీసీసీఐ నియమించేందుకు సిద్ధమైంది. దిలీప్‌ జట్టు నుంచి వెళ్ళిపోయిన నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకుంటూ.. ఆయన సేవలను కొనియాడాడు.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో టీ దిలీప్‌తో ఉన్న ఫొటోను పంచుకున్న రోహిత్ శర్మ.. సుదీర్ఘ పోస్ట్ చేశాడు. ‘దిలీప్ గురూ.. నువ్వు నిజమైన లెజెండ్. జట్టులో అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించావు. తెర వెనుక ఎంతగానో కష్టపడిన వ్యక్తివి. నీ భవిష్యత్ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అంటూ ప్రశంసించాడు. రోహిత్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిలీప్‌, రోహిత్ మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.

టీ దిలీప్ 2021లో భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆయన మార్గదర్శకత్వంలో టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు గణనీయంగా మెరుగయ్యాయి. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ప్రారంభించిన ‘బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్’ మెడల్ విశేష ఆదరణ పొందింది. ప్రతి మ్యాచ్ అనంతరం అత్యుత్తమ ఫీల్డర్‌కు మెడల్ అందించడం ద్వారా ఆటగాళ్లలో ఫీల్డింగ్‌పై మరింత ఉత్సాహాన్ని పెంచే ప్రయత్నం చేశారు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు ఈ మెడల్‌ను అందుకున్నారు.

భారత జట్టుతో తన ప్రయాణం ముగియడంతో టీ దిలీప్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో బావోద్వేగంగా స్పందించాడు. ‘ఈ ఐదేళ్ల ప్రయాణాన్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం. భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డ్రెస్సింగ్ రూమ్‌లో ఫీల్డింగ్ మెడల్ ఆటగాళ్ల ముఖాల్లో కనిపించిన ఆనందం జీవితాంతం గుర్తుండిపోతుంది. 2024-2026 టీ20 ప్రపంచకప్‌లు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2023-2025 ఆసియా కప్‌లు గెలవడం నా కెరీర్‌లో చిరస్మరణీయ ఘట్టాలు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్, 2023 వన్డే ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలిచిన జట్టులో భాగమవడం గర్వకారణం’ అని చెప్పాడు.

బీసీసీఐ, భారత జట్టు, హెడ్ కోచ్‌లుగా పనిచేసిన రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్‌లకు టీ దిలీప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు సహచర కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌కు కూడా ధన్యవాదాలు తెలిపాడు. ‘భారత్ బ్యాడ్జ్ ధరించి ఐదేళ్లు సేవలందించడం నా జీవితంలో మరపురాని గౌరవం. ఈ అధ్యాయం ముగిసినా.. నా ప్రయాణం మాత్రం కొనసాగుతుంది’ అని పేర్కొన్నాడు. టీ దిలీప్ స్థానంలో సుభదీప్ ఘోష్ భారత పురుషుల జట్టు కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమితులయ్యాడు. గతంలో భారత మహిళల జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన ఘోష్.. ఇండియా-ఏ జట్టుతో పాటు అసోం సీనియర్ జట్టుకు హెడ్ కోచ్‌గా కూడా సేవలందించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu