Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..

Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..

NTV Telugu 4 days ago

అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ కరెన్సీతో పోలిస్తే భారత రూపాయి విలువ మునుపెన్నడూ లేనంతగా క్షీణించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు, ముడిచమురు ధరల పెరుగుదల, విదేశీ నిధులు వెనక్కి వెళ్తుండటంతో రూపాయి విలువ ఏకంగా రూ.96.68 మార్కును దాటి సరికొత్త రికార్డు స్థాయి పతనానికి చేరుకుంది.

ఈ పరిణామం దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశీ కరెన్సీకి అండగా నిలిచేందుకు బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరతను తీర్చేందుకు భారత కేంద్ర బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రంగంలోకి దిగింది.

మే 26, 2026న భారీ ఎత్తున 5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.41,000 కోట్లకు పైగా) విలువైన 'డాలర్-రూపీ బై/సెల్ స్వాప్ ఆక్షన్' నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. మూడేళ్ల సుదీర్ఘ గడువుతో కూడిన ఈ ప్రత్యేక ఆర్థిక చర్య ద్వారా మార్కెట్లో స్థిరత్వం తీసుకురావాలని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ ప్రక్రియ అంతా ఆర్‌బీఐ, దేశంలోని కమర్షియల్ బ్యాంకుల మధ్య జరుగుతుంది.

మొదట మే 26న జరిగే వేలంలో అర్హత గల బ్యాంకులు తమ వద్ద ఉన్న యూఎస్ డాలర్లను ప్రస్తుత రిఫరెన్స్ రేటు ప్రకారం ఆర్‌బీఐకి విక్రయిస్తాయి. దానికి బదులుగా ఆర్‌బీఐ నుంచి భారీ మొత్తంలో భారతీయ రూపాయలను పొందుతాయి. ఇది మే 29, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. రెండో దశలో.. ఈ ఒప్పందం ప్రకారం, సరిగ్గా మూడేళ్ల తర్వాత అంటే మే 29, 2029న, బ్యాంకులు తాము ఆర్‌బీఐకి అమ్మిన డాలర్లను ముందే నిర్ణయించుకున్న ప్రీమియం రేటు చెల్లించి తిరిగి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వేలంలో పాల్గొనడానికి కనీస బిడ్ పరిమాణాన్ని 10 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. బ్యాంకులు తమకు నచ్చిన ప్రీమియం మొత్తాన్ని పైసల రూపంలో కోట్ చేస్తూ ఎన్ని బిడ్లయినా దాఖలు చేయవచ్చు.

రూపాయి మారకం విలువ విపరీతంగా పడిపోకుండా నియంత్రించడానికి ఆర్‌బీఐ మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా ఆర్‌బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో రూపాయి కొరత ఏర్పడింది.

ఇప్పుడు ఈ రూ.41,000 కోట్ల విలువైన స్వాప్ ఆక్షన్ ద్వారా మార్కెట్‌లోకి శాశ్వత ప్రాతిపదికన రూపాయి నిధులు వచ్చి చేరుతాయి. దీనివల్ల బ్యాంకులకు నిధుల లభ్యత పెరిగి, వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. అలాగే విదేశీ మారక నిల్వలకు తాత్కాలికంగా డాలర్ల అండ లభిస్తుంది. ఫలితంగా, డాలర్‌కు ఉన్న విపరీతమైన డిమాండ్ కాస్త తగ్గి, రూపాయి మరింత దిగజారకుండా బ్రేకులు పడతాయని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu