Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..

Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..

NTV Telugu 3 weeks ago

Russia: అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఒక అరుదైన, ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పాదక దేశాల్లో ఒకటైన రష్యా.. ఇప్పుడు తన దేశీయ అవసరాల కోసం భారతదేశం నుంచి గ్యాసోలిన్ (పెట్రోల్) దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది.

ఉక్రెయిన్ జరిపిన వరుస డ్రోన్ దాడుల్లో రష్యాకు చెందిన పలు ఆయిల్ రిఫైనరీలు, ఇంధన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతినడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ షాకింగ్ వివరాలను వెల్లడించింది.

11 టైమ్ జోన్లలోనూ తీవ్ర కొరత..

ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాలోని గ్యాసోలిన్ ఉత్పత్తి దాదాపు 25 శాతం పడిపోయింది. దీంతో రష్యాలోని మొత్తం 11 టైమ్ జోన్ల పరిధిలో ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టడం, ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ప్రభుత్వం ఇంధన రేషనింగ్‌ను కూడా అమలు చేస్తోంది. ప్రస్తుతం రష్యాకు రోజుకు కనీసం 1.10 లక్షల టన్నుల గ్యాసోలిన్ అవసరం కాగా.. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ఈ కొరతను అంగీకరించారు.

భారత్ నుంచి రష్యాకు చమురు..

ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి రష్యా వివిధ దేశాల నుంచి ప్రతి నెలా దాదాపు 4 లక్షల టన్నుల గ్యాసోలిన్ దిగుమతి చేసుకోవాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే భారత్ నుంచి కనీసం 60,000 మెట్రిక్ టన్నుల గ్యాసోలిన్‌తో కూడిన రెండు భారీ నౌకలు రష్యాకు పయనమయ్యాయి. భారతదేశానికి చెందిన ఏ రిఫైనరీ ఈ ఇంధనాన్ని సరఫరా చేసిందనేది మాత్రం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. పొరుగు దేశమైన బెలారస్ కూడా రష్యాకు గ్యాసోలిన్ సరఫరాను మూడు రెట్లు పెంచింది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఇంధనం ఆర్థికంగా భారం కాకుండా ఉండేందుకు రష్యా పార్లమెంట్ తమ పన్ను నిబంధనలలో కీలక సవరణలు చేసింది. భారతీయ రవాణా ఖర్చులు, చమురు ధరలకు అనుగుణంగా దిగుమతి చేసుకునే కంపెనీలకు బడ్జెట్ సబ్సిడీలను అందించేలా కొత్త చట్టాన్ని ఆమోదించింది.

తిరగబడిన అంతర్జాతీయ సమీకరణాలు..

నిజానికి, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశం రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. జూన్ నెలలో భారత మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఏకంగా 50 శాతం దాటింది (రోజుకు 27 లక్షల బ్యారెళ్లు). రష్యా నుంచి తక్కువ ధరకే ముడి చమురును కొనుగోలు చేసి, దానిని శుద్ధి చేస్తున్న భారత్.. ఇప్పుడు అదే రష్యాకు తిరిగి గ్యాసోలిన్ రూపంలో ఇంధనాన్ని ఎగుమతి చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu