Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్‌లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..

Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్‌లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..

NTV Telugu 2 weeks ago

Sai Sudarshan: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఓ వింత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో అతను అవుట్ అయిన తీరు చూసి క్రికెట్ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఎందుకంటే, కేవలం కొన్ని రోజుల క్రితమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లోనూ సుదర్శన్ సరిగ్గా ఇలాగే అవుట్ అయ్యాడు. ఒకే సీజన్ లో, అది కూడా బ్యాక్ టు బ్యాక్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒకే బ్యాటర్ వరుసగా రెండుసార్లు హిట్ వికెట్‌గా వెనుతిరగడం ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన వింత రికార్డుగా మారింది. నిజానికి ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విధించిన 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సాయి సుదర్శన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రాజస్థాన్ బౌలర్లను సుదర్శన్ చీల్చిచెండాడాడు. వీరిద్దరూ కేవలం 77 బంతుల్లోనే ఏకంగా 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించేలా కనిపించింది. కేవలం 26 బంతుల్లోనే సుదర్శన్ మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా, ఈ సీజన్‌లో 700 పరుగుల మైలురాయిని సైతం దాటేశాడు. ఐపీఎల్ 2026లో అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాటర్లలో ఒకడిగా నిలిచిన సుదర్శన్, గిల్‌తో కలిసి మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ వైపు తిప్పేశాడు.

అయితే ఆ తర్వాతే ఆ వింత సంఘటన జరిగింది. ఆఫ్ సైడ్ వెనుక వైపు ఒక షాట్ ఆడబోయిన సుదర్శన్ బ్యాట్, అనూహ్యంగా వెనుక ఉన్న వికెట్లను బలంగా తాకింది. దాంతో అతను హిట్ వికెట్‌గా వెనుతిరగాల్సి వచ్చింది. సుదర్శన్ అవుట్ అయినప్పటికీ గుజరాత్ జోరు మాత్రం తగ్గలేదు. మరోవైపు శుభ్‌మన్ గిల్ కేవలం 47 బంతుల్లోనే సెంచరీ బాది జట్టును విజయతీరాలకు చేర్చే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. కానీ, మ్యాచ్‌లో ఇంతటి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు నమోదైనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం సాయి సుదర్శన్ అవుట్ అయిన తీరుపైనే అందరూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో హల్చల్ చేస్తున్నారు. “ఈ రికార్డుల వేటగాడు సాయి సుదర్శన్‌ను ఆపడం ఎవరికైనా సాధ్యమేనా? అతన్ని అవుట్ చేయాలంటే అది కేవలం అతని వల్ల మాత్రమే అవుతుంది” అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. గత రెండేళ్లలోనే అతను ఇలా హిట్ వికెట్ అవ్వడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 2022లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ఇలాగే అవుట్ కాగా, మిగిలిన రెండు సార్లు ఈ సీజన్ ప్లేఆఫ్స్‌లోనే జరగడం విశేషం.

ఈ వింత అవుట్లపై మ్యాచ్ ముగిసిన తర్వాత సాయి సుదర్శన్ సరదాగా స్పందించాడు. బ్రాడ్‌కాస్టర్లతో సుదర్శన్ మాట్లాడుతూ.. దీని నుంచి తప్పించుకోవడానికి ఇకపై బ్యాట్ గ్రిప్‌కు సంబంధించి ఏదైనా కొత్త టెక్నిక్ వాడాలేమో అని నవ్వుతూ అన్నాడు. అసలు ఇది ఎలా జరుగుతుందో నిజంగా తనకే అర్థం కావడం లేదన్నాడు. గత మ్యాచ్‌లో (ఆర్‌సీబీపై) బంతి టర్న్ అవ్వడం వల్ల వికెట్లను కొట్టేశానని, కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం తానే స్వయంగా వెళ్లి వికెట్లను నేరుగా కొట్టాలని అనుకున్నట్లు ఉందంటూ తనపై తనే జోకులు పేల్చాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu