Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్

SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్

NTV Telugu 2 weeks ago

కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోడీ ఉగ్రవాదంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా ఉపయోగించే దేశాలు, ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు ఇచ్చే దేశాలకు అంతర్జాతీయ సమాజం గట్టి సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

"ఉగ్రవాదం ఎప్పటికీ వ్యూహాత్మక ఆస్తి కాదు" అని మోడీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎస్‌సీవో దేశాధినేతలను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని తమ విధానాలను అమలు చేసేందుకు సాధనంగా ఉపయోగించే దేశాలను ఉపేక్షించకూడదన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారికి మద్దతు ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడే దేశాలకు అంతర్జాతీయ సమాజం నుంచి గట్టి హెచ్చరిక వెళ్లాలని అన్నారు. "ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు లేదనే విషయాన్ని మనమంతా ఒకే గొంతుతో చెప్పాలి. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా ఉపయోగించే దేశాలు, ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు ఇచ్చే దేశాలకు ఉగ్రవాదం వ్యూహాత్మక ఆస్తి కాదనే బలమైన సందేశం ఇవ్వాలి" అని మోడీ పేర్కొన్నారు.

ఉగ్రవాద వ్యవస్థను నిర్మూలించాలి

ఉగ్రవాదానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాదుల నియామకం, తీవ్రవాద భావజాలం వైపు మళ్లించడం, వారికి సురక్షిత స్థావరాలు కల్పించడం వంటి అన్ని అంశాలపై దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు. 2025లో జరిగిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో మోడీ తాజా వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదంపై భారత్ వైఖరిని మోడీ మరోసారి స్పష్టం చేశారు. మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశాల మధ్య సహకారం అవసరమని మోడీ అన్నారు. అయితే ఇలాంటి ప్రాజెక్టులు ఇతర దేశాల సార్వభౌమ భూభాగాన్ని గౌరవించేలా ఉండాలని స్పష్టం చేశారు.

బిష్కెక్‌లో జరిగిన ఈ సమావేశానికి మోడీ, షెహబాజ్ షరీఫ్‌తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో, కజకిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్-జోమార్ట్ టోకయేవ్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్, తజికిస్థాన్ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మాన్ తదితరులు హాజరయ్యారు.

2001లో ఏర్పడిన SCO

పరస్పర విశ్వాసం, స్నేహం, పొరుగు దేశాలతో సత్సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు వివిధ రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని ప్రోత్సహించడం SCO ప్రధాన లక్ష్యాలు. 2001లో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలతో ఈ సంస్థ ఏర్పడింది. 2017లో భారత్, పాకిస్థాన్ పూర్తిస్థాయి సభ్యదేశాలుగా చేరాయి. 2023లో ఇరాన్, 2024లో బెలారస్ సభ్యదేశాలుగా చేరాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu