Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్‌ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త

Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్‌ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త

NTV Telugu 21 hrs ago

ఐక్యరాజ్యసమితి వేదికగా ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ అవాకులు చెవాకులు ప్రేలారు. 2025 మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై విజయం సాధించినట్లుగా పిచ్చి వాగుడు వాగారు.

తమ సైన్యం విజయం సాధించిందన్నారు.. ఈ సందర్భంగా సైన్యంపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న భారత దౌత్యవేత్త ఆర్.శ్రీనివాస్ నవ్వుతూ.. తల ఊపుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2025 మేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ అనంతరం చోటుచేసుకున్న సైనిక ఘర్షణను షెహబాజ్ షరీఫ్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. పాకిస్థాన్ సాయుధ దళాలు "ఖచ్చితత్వం, వృత్తి నైపుణ్యంతో" స్పందించాయని పేర్కొన్నారు. భారత దాడిని తిప్పికొట్టి, శత్రువుకు గుణపాఠం చెప్పామని వ్యాఖ్యానించారు. ఇక భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణలు మరింత విస్తరించకుండా ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన జోక్యాన్ని కూడా షెహబాజ్ ప్రశంసించారు. రెండు అణ్వాయుధ దేశాలు పూర్తిస్థాయి యుద్ధానికి చేరువైన సమయంలో ట్రంప్ "సమయోచిత జోక్యం" చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే ట్రంప్ ప్రకటనను భారత్ తోసిపుచ్చింది. ఈ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని కొట్టిపారేసింది.

ఇక సింధు జలాల ఒప్పందాన్ని కూడా ప్రస్తావించారు. పాకిస్థాన్‌కు దక్కాల్సిన సింధు నది నీటిని ఆపడం, అడ్డుకోవడం లేదా మళ్లించేందుకు ప్రయత్నిస్తే దాన్ని "యాక్ట్ ఆఫ్ వార్"గా పరిగణిస్తామని హెచ్చరించారు. జమ్మూ కశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. దీనిపై భారత్ ఐక్యరాజ్యసమితిలో 'రైట్ ఆఫ్ రిప్లై' వినియోగించి స్పందించింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పేటల్ గహ్లోత్.. పాకిస్థాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ.. ఉగ్రవాదంపై భారత్ తనను తాను రక్షించుకునే హక్కును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ భారత్‌లో "అంతర్భాగం, విడదీయరాని భాగం" అనే తమ వైఖరిని గహ్లోత్ మరోసారి పునరుద్ఘాటించారు. కశ్మీర్ గురించి మాట్లాడాల్సి వస్తే పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌ పరిస్థితిపై దృష్టి పెట్టాలని ఆమె పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాని ప్రసంగంలో చేసిన ఉగ్రవాదం, కశ్మీర్, ప్రజాస్వామ్య హక్కులు, మైనారిటీలకు సంబంధించిన వ్యాఖ్యలపై కూడా గహ్లోత్ స్పందించారు. పాకిస్థాన్ నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఉగ్రవాదానికి పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత ప్రభుత్వం.. మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu