Tuesday, 29 Dec, 2.10 pm NTV Telugu

హోమ్
సినీఅవలోకనం 2020

2020.. ఈ ఏడాది ఓ జీవితకాల అనుభవాన్ని నేర్పింది. భవిష్యత్తు సంగతి ఏమో కానీ... 'న భూతో' అని మాత్రం ప్రతి ఒక్కరూ అనుకునేలా చేసింది. ఇతర రంగాల మాదిరే చిత్రసీమ సైతం అలజడికి గురైంది. అయితే... అదే సమయంలో ఆత్మ నిబ్బరాన్ని ప్రదర్శిస్తూ... కొందరు కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. మరికొందరు సరికొత్త దారులూ వెదుక్కున్నారు. వెరశీ... ఈ యేడాది సినిమా రంగంలోని ప్రధాన ఘట్టాలపై ఓసారి దృష్టి సారిద్దాం...


కరోనా కారణంగా కలత చెందని వారు లేరంటే అతిశయోక్తి లేదు. అయితే... నిరాశాభరిత వాతావరణంలోనూ సరికొత్త బంధం కోసం సరాగాలూ తీసిన వారూ ఉన్నారు. నిజం చెప్పాలంటే... కోవిడ్ సమయంలోనే కొందరికి ఆత్మీయత ఏమిటో తెలిసింది! అందుకే... మన టాలీవుడ్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కొందరు ఈ యేడాది ఎంచక్కా పెళ్ళి పీటలు ఎక్కేశారు.

టాలీవుడ్ లో ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే చాలానే ఉంటుంది. మూడు పదులు నిండినా మనువుపై దృష్టిపెట్టని హీరోలే ఎక్కువ. కొందరు హీరోయిన్ల పరిస్థితి కూడా ఇదే. అయితే కరోనా కారణంగా తొలుత కొంత వెనకడుగు వేసినా... ఆ తర్వాత వీరంతా సూపర్ స్పీడ్ లో దూసుకుపోయారు. మనసుకు నచ్చిన వారిని మనువాడిన వారు కొందరైతే, పెద్దల అభిష్టానికి అనుగుణంగా పెళ్ళి పీటలు ఎక్కిన వారు మరి కొందరు! ఈ యేడాది అలాంటి శుభారంభానికి తమిళ, తెలుగు చిత్రాలలో నటించిన మహిత్ రాఘవేంద్ర శ్రీకారం చుట్టాడు. తన స్నేహితురాలు ప్రాచీ మిశ్రా మెడలో ఫిబ్రవరి 1న మహత్ మూడు ముడులూ వేశాడు. అతని వెనుకే సాగుతూ 5వ తేదీ ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగిబాబు సైతం ఓ ఇంటి వాడయ్యాడు. యోగిబాబు వివాహం మంజుభార్గవితో తిరుత్తణిలోని దేవాలయంలో జరిగింది. ఆ తర్వాత లాక్ డౌన్ పెట్టడంతో, కరోనా కారణంగా శుభకార్యాలకూ కొంత ఫుల్ స్టాప్ పడిపోయింది. అయితే పెళ్ళి విషయంలో మాత్రం ముహూర్తం మార్చుకునేది లేదని యంగ్ హీరో నితిన్ గౌడ కుటుంబం భావించింది. 'జాగ్వర్'తో టాలీవుడ్, శాండిల్ వుడ్ లోకి అడుగుపెట్టిన మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ పెళ్ళి అంగరంగ వైభవంగా బెంగళూర్ లో రేవతితో జరిగింది. ఆ తర్వాత ఇది పలు విమర్శలకూ తావిచ్చింది.

కరోనా కారణంగా వివాహ వేడుకలకూ రూల్స్ పెట్టేసింది ప్రభుత్వం. ఇది కూడా ఒకందుకు మంచిదే అయ్యింది. తన భార్య అనిత మరణానంతరం మూడేళ్ళు ఒంటరి జీవితానికి స్వస్తి పలికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు మే 10న నిజామాబాద్ లో నిరాడంబరంగా తేజస్విని తో కలిసి ఏడు అడుగులు వేశారు. 'దిల్' రాజు చూపిన బాటలోనే యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ సైతం నడిచాడు. మే 14న డాక్టర్ పల్లవి వర్మతో షామిర్ పేటలో నిఖిల్ పెళ్ళి బంధువుల సమక్షంలో జరిగింది. ఇదే రోజున జబర్దస్త్ ఫేమ్ మహేశ్ సైతం పావని మెడలో మూడు ముడులు వేశాడు. విజయ్ కుమార్, మంజుల పెద్ద కుమార్తె, 'దేవి' ఫేమ్ వనిత జూన్ 27న పీటర్ పాల్ ను పెళ్ళి చేసుకుంది. కానీ కొద్ది రోజులకే వీరి మధ్య పొరపొచ్చలు వచ్చాయి. కరోనా కారణంగా తన పెళ్ళిని రెండు నెలలు వాయిదా వేసుకున్న హీరో నితిన్ సైతం... జులై 26న ఫలక్ నుమా ప్యాలెస్ లో తన నెచ్చెలి షాలినిని వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకకు రాష్ట్రమంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస గౌడ్ హాజరయ్యారు.

నటులే కాదు... సాంకేతిక నిపుణులు సైతం ఈ యేడాది ఓ ఇంటివారయ్యారు. 'సినిమా చూపిస్త మావా, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే' వంటి ప్రేమకథా చిత్రాలకు రచన చేసిన బెజవాడ ప్రసన్న కుమార్ జూలై 29న మచిలీపట్నంలో మౌనికను పెళ్ళాడాడు. తొలి చిత్రం 'రన్ రాజా రన్'తో యువత మదిని దోచిన డైరెక్టర్ సుజిత్ రెడ్డి వివాహం ప్రవల్లికతో ఆగస్ట్ 2న హైదరాబాద్ లో జరిగింది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్... రానా సైతం ఆగస్ట్ 8న పెళ్ళి పీటలు ఎక్కేయడం విశేషం. ఎంతోకాలంగా తన ప్రేమను రహస్యంగా ఉంచిన రానా... సోషల్ మీడియా ద్వారా దానిని బహిర్గతం చేయడం ఓ ఎత్తు కాగా... అంగరంగ వైభవంగా అతి కొద్ది మంది సమక్షంలో మిహికా బజాజ్ ను మనువాడటం మరో ఎత్తు.

కరోనా కారణంగా కొన్ని పెళ్ళిళ్ళు వాయిదా పడ్డాయి. కానీ చిత్రంగా అందాల చిన్నది, 'మేం వయసుకు వచ్చాం' ఫేమ్ నీతి టేలర్ మ్యారేజ్ ప్రీ పోన్ అయ్యింది. గత యేడాది ఆగస్ట్ 13న నీతిటేలర్ కు పరిక్షిత్ తో నిశ్చితార్థం జరిగింది. ఈ యేడాది అక్టోబర్ లో వీరిరువురూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. కానీ అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో అనే భయంతో ఆగస్ట్ 13నే పెళ్ళిపీటలెక్కేశారు. ఒకప్పటి బాల నటుడు, 'దిక్సూచి' చిత్రంతో హీరోగా ఎదిగిన దిలీప్ కుమార్ సల్వాది వివాహం ఆగస్ట్ 14న డా. దివ్యతో జరిగింది. 'కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమతీ అండ్ రామకృష్ణ' చిత్రాలతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న షాలినీ వడ్నికట్టి పెళ్ళి తమిళ దర్శకుడు మనోజ్ తో ఆగస్ట్ 21న అయ్యింది. ఇక తన బోయ్ ఫ్రెండ్ సామ్ అహ్మద్ తో కొంతకాలంగా సహజీవనం చేస్తూ, సోషల్ మీడియాను హాట్ వీడియోస్ తో వేడెక్కిస్తున్న పూనమ్ పాండే సైతం సెప్టెంబర్ 11న మ్యారేజ్ చేసుకుంది.

హీరోలే కాదు... మన హీరోయిన్లు సైతం మనసుకు నచ్చిన వారితోనే జీవితాన్ని పంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అలా తమిళ, మలయాళ చిత్రాలతో పాటు తెలుగులో 'ఉంగరాల రాంబాబు'లో నటించిన మియా జార్జ్... అశ్విన్ ఫిలిప్ ను సెప్టెంబర్ 12న కొచ్చిలోని చర్చిలో మ్యారేజ్ చేసుకుంది. ఉత్తరాదికి చెందిన పాపులర్ సింగర్ నేహా కక్కర్ తన కంటే వయసులో ఐదారేళ్ళు చిన్నవాడైన రోహన్ ప్రీత్ ను అక్టోబర్ 24న గురుద్వారాలో పెళ్ళాడింది. ఇక స్టార్ హీరోయిన్ కాజల్ సైతం తన పెళ్ళి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. చిరకాల స్నేహితుడు గౌతమ్ కిచ్లూ తో కలిసి ముంబైలో సింపుల్ గా పెళ్ళి చేసుకుంది. విశేషం ఏమంటే.. ఈ పెళ్ళి ఫోటోలే కాదు... ఆ తర్వాత వారు హనీమూన్ కు వెళ్ళినప్పటి ఫోటోలు సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక తాజాగా 'ఆచార్య' షూటింగ్ లో పాల్గొనడానికి భర్తతో కలిసి వచ్చిన కాజల్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించడం ఓ విశేషం.

ప్రముఖ గీత రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి రెండో కుమారుడు, నటుడు రాజా పెళ్లి అక్టోబర్ 31న నిరాడంబరంగా లక్ష్మీ హిమబిందుతో హైదరాబాద్ లో జరిగింది. నటుడు సమ్రాట్ రెడ్డి మొదటి భార్య హర్షితకు విడాకులు ఇచ్చి, శ్రీలిఖితను కాకినాడలో పెళ్ళి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే... ఆ మధ్య ఆధ్యాత్మిక మార్గం పట్టిన నటి సనాఖాన్ నిఖా సూరత్ లో నవంబర్ 21న ముఫ్తీ అసాజ్ సయ్యద్ తో అయ్యింది. లిరిక్ రైటర్ గా పాపులారిటీని సంపాదించుకున్న శ్రీమణి సైతం తన చిరకాల స్నేహితురాలు ఫరాను పెద్దల అంగీకారంతో నవంబర్ 22న పెళ్ళి చేసుకున్నాడు. ఇక... ఇటు కొణిదెల, అటు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అత్యంత ఆనందంగా జరుపుకున్న పెళ్ళి నాగబాబు కుమార్తె నిహారికది. చైతన్య జొన్నలగడ్డతో ఆమె డెస్టినేషన్ వెడ్డింగ్ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. గుత్తా జ్వాల నిశ్చితార్థం తమిళ యువ నటుడు విష్ణు విశాల్ తో హైదరాబాద్ లో, హాస్యనటి విద్యుల్లేఖ రామన్ - సంజయ్ రోకా వేడుక చెన్నయ్ లో జరిగాయి. ప్రముఖ గాయని సునీత ఎంగేజ్ మెంట్ మ్యాంగో మీడియా అధినేత రామ్ తోనూ నిరాడంబరంగా జరిగింది. అలా ఈ యేడాది కరోనాకు భయపడుకుండా... తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు... హ్యాపీగా వివాహబంధంలోకి అడుగుపెట్టేశారు.

నిజం చెప్పాలంటే తెలుగు చిత్రసీమలో విజయోత్సవాలు ఆగిపోయి చాలా కాలమే అయ్యింది. అయితే... కాలంతో పాటు కొందరు సినీ ప్రముఖులు అవకాశం చిక్కినప్పుడల్లా తమ ఉదారత చాటుకున్నారు. అలానే ప్రభుత్వాలూ... చిత్రసీమకు తమవంతు సాయం అందిస్తూనే ఉంది.

ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' విజయంతో రశ్మిక మందణ్ణ ఆనందానికి హద్దులేకుండా పోయింది. అయితే ఆ ఉరకలేసే ఉత్సాహాంపై ఐటీ శాఖ నీళ్ళు కుమ్మరించింది. జనవరి16న బెంగళూరులోని రశ్మికా మందణ్ణ నివాసంలో ఐటీ సోదాలు జరిగాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు ఓ అరుదైన పురస్కారం దక్కింది. ఇంటరాక్టివ్ ఫోరమ్‌ ఆన్ ఇండియన్ ఎకానమీ సంస్థ 'ఛాంపియన్ ఆఫ్ ఛేంజ్' అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అరవింద్ కు న్యూఢిల్లీలో జనవరి 20న అందచేసింది. ఎప్పటిలానే ఈ యేడాది కూడా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల విషయంలో తెలుగువారిపై శీతకన్ను వేసింది. కంగనా రనౌత్, కరణ్‌ జోహార్, ఏక్తా కపూర్, అద్నాన్ సమి వంటి వారు పద్మ అవార్డుల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఇక ప్రతిష్ఠాత్మక 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్ లో ఫిబ్రవరి 10న అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణ కొరియాకు చెందిన 'పారసైట్‌' ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. ఆస్కార్ చరిత్రలోనే ఈ అవార్డ్ అందుకున్న తొలి ఆంగ్లేతర చిత్రం ఇదే! ఉత్తమ నటుడిగా జోక్విన్ ఫీనిక్స్, నటిగా రేనీ జెల్వెగర్, దర్శకుడిగా బాంగ్ జూ-హో అవార్డులు గెలుచుకున్నారు.

తెలంగాణలో సినిమా రంగ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించేందుకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్... ఫిబ్రవరి 10న చిరంజీవి, నాగార్జునతో సమావేశమయ్యారు. ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్, కల్చరల్ సెంటర్, నైపుణ్యాభివృద్ది కేంద్రం ఏర్పాటు తదితర అంశాలపై వారు చర్చించారు. ఫిబ్రవరి 15న ప్రముఖ నటి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాకు సరోగసి ద్వారా అమ్మాయి పుట్టింది. పాపకు సమిశాశెట్టి అనే పేరు పెట్టారు. హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ అధికారిగా మార్చి 4వ తేదీ వి. బాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా మార్చి 15 నుండి సినిమా థియేటర్లు మూసివేయాలని సీ.ఎం. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని బలపరుస్తూ సినిమా హాళ్ళను బంద్ చేశారు. మార్చి 20 నుంచి ఆంధ్రప్రదేశ్ లోనూ థియేటర్లను మూసేశారు. కరోనా కారణంగా ప్రజా జీవనం అల్లకల్లోలం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు మొదలెట్టాయి. దాంతో తమవంతు భాగంగా మార్చి 26న పలువురు సినీ ప్రముఖులు భారీ స్థాయిలో విరాళాలను ప్రకటించారు. చిరంజీవి నేతృత్వంలో సీసీసీ ద్వారా సినీ కార్మికులకు నిత్యావసర వస్తువలనూ అందించారు. మే 19న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా, టీవీ షూటింగ్స్ కోసం సింగిల్ విండో పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ సీ.ఎం. కేసీఆర్ ను మే 22న కొందరు సినీ ప్రముఖులను కలిశారు. కరోనా కారణంగా సినీజనం పడుతున్న ఇబ్బందులు తెలియచేయడానికి జూన్ 9న ఏపీ సీఎం జగన్ ను చిరంజీవీ, నాగార్జున తో పాటు పలువురు నిర్మాతలు కలిశారు. ఆంధ్రపదేశ్ లోనూ సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని జగన్ తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ కు అనుమతిని ఇస్తూ జీవో జారీ చేసింది. ఇదిలా ఉంటే... గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ అవార్డును తొలిసారి ఇద్దరు నూతన దర్శకులకు ప్రకటించారు. మలయాళ చిత్రం 'కుంబలంగీ నైట్స్' రూపొందించిన మధు సి. నారాయణన్, 'యురి: ది సర్జికల్ స్ట్రైక్'ను తెరకెక్కించిన ఆదిత్య ధర్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సినిమా షూటింగ్స్ జరుపుకోవచ్చని ఆగస్ట్ 23న కేంద్ర సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. సెప్టెంబర్ 10న నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఛైర్మన్ గా ప్రముఖ నటుడు, పార్లమెంట్ సభ్యుడు పరేశ్ రావెల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇదే నెల 29న ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ ను ఎఫ్‌.టి.ఐ.ఐ. పుణే ప్రెసిడెంట్ గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 20న సినీ ప్రముఖులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. గతంలో కరోనా కారణంగా విరాళాలు ఇచ్చిన వారిలో కొందరు హైదరాబాద్‌ వరద నివారణకూ సాయం అందించారు. నవంబర్ 7న మరోసారి సి.ఎం. కేసీఆర్ ను చిరంజీవి, నాగార్జున కలిశారు. హైదరాబాద్ శివార్లలో ఫిల్మ్ సిటీ ని నిర్మిస్తామని, అందుకోసం బల్గేరియాలోని ఫిల్మ్ సిటీని సందర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను పంపుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇదే నెల 16న కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ థియేటర్లు తెరచుకోవచ్చునంటూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జనవరిలో కొత్త పార్టీని ఖచ్చితంగా పెడతానంటూ అభిమానులకు డిసెంబర్ 3న రజనీకాంత్ హామీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా మూతపడిన థియేటర్లను తెలంగాణాలో తిరిగి తెరిచారు. చిత్రపురి సినీ ఎంప్లాయిస్ హౌసింగ్ సొసైటీకి డిసెంబర్ 10న జరిగిన ఎన్నికల్లో నటుడు వినోద్ బాల ప్యానెల్ విజయకేతనం ఎగరేసింది. కోవిడ్ 19 వల్ల ఈ యేడాది గోవాలో జరగాల్సిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్నిజనవరికి వాయిదా వేశారు. ఈసారి ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియన్ పనోరమా విభాగానికి తెలుగు సినిమా 'గతం' ఎంపిక కావడం విశేషం. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. పదిహేను వారాల పాటు సాగిన బిగ్ బాస్ సీజన్ 4 లో నటుడు అభిజిత్ విన్నర్ గా నిలిచాడు. నాగార్జున హోస్ట్ చేసిన ఈ షో ఫినాలేకు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

వినోదమే ప్రధానంగా సాగే చిత్రసీమలో వివాదాలకూ ఒక్కోసారి కొదవ ఉండదు. అయితే... అది ఏ స్థాయిలో జరిగిందన్నదే ప్రధానం. ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లుకలుకలతో మొదలైన వివాదాలు... బాలీవుడ్, శాండిల్ వుడ్స్ ను డ్రగ్స్ వ్యవహారంతో అతలాకుతలం చేసేశాయి.

కొత్త సంవత్సరం రెండో రోజే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని వివాదాలు రాజుకున్నాయి. 'మా' డైరీ ఆవిష్కరణ సమయంలో రాజశేఖర్‌ ప్రవర్తనపై చిరంజీవి. మోహన్ బాబు అసహనానికి గురయ్యారు. దాంతో జనవరి 5న ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు. దాన్ని కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్, జయసుధలతో ఏర్పాటైన క్రమశిక్షణ, సమన్వయ సంఘం ఆమోదించింది. దీని పర్యవసానంగా కొద్ది రోజులకు 'మా' అధ్యక్షుడు నరేశ్ సెలవులో వెళ్ళిపోయారు. దాంతో అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షుడు బెనర్జీ స్వీకరించారు. ఎస్వీబీసీ ఛైర్మన్ గా నియమితులైన పృథ్వీరాజ్ కు కొద్ది నెలలకే చుక్కెదురైంది. తనపై వచ్చిన ఆరోపణలలోని నిజానిజాలను నిగ్గుతేల్చమని కోరుతూ పృథ్వీరాజ్ తన పదవికి జనవరి 12న రాజీనామా చేశారు. బిగ్ బాస్ త్రీ విజేత రాహుల్ సిప్లిగంజ్ తాండూరు ఎమ్మెల్యే సోదరుడు రితేష్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఓ పబ్ లో ఆయన తనపై దాడి చేశారంటూ మార్చి 5న రాహుల్ పోలీసులను ఆశ్రయించారు. ఎన్టీయార్ జయంతి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సినీ పెద్దలు తెలంగాణ సీఎంను కలవడంపై నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నటి మీరా చోప్రా జూన్ 1న ట్విట్టర్ లో అభిమానులతో జరిపిన చర్చ చివరకు రచ్చకు దారి తీసింది. ఎన్టీయార్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడంతో సిటీ పోలీస్, సైబర్ క్రైమ్ విభాగాలకు ఫిర్యాదు చేసింది. జాతీయ మహిళా కమీషన్ దృష్టికీ తీసుకెళ్ళింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇదే రకమైన ఇబ్బందిని మహేశ్ బాబు అభిమానుల కారణంగా దర్శకుడు తరుణ్‌ భాస్కర్ ఎదుర్కొన్నారు. 'కప్పెల' చిత్రం గురించి ఆయన పెట్టిన పోస్ట్ మహేశ్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. తనను ట్రోల్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు తరుణ్ రిపోర్ట్ చేశారు.

ప్రముఖ దర్శకనిర్మాత, నటుడు స్వర్గీయ దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌ కుమార్ ఆస్తి తగదా విషయమై జూన్ 24న ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. అదే రోజున నటి పూర్ణ తల్లి తన కుమార్తెను కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కొచ్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు నాలుగురిని అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 26న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు, నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్‌ కంట్రోల్ బోర్డ్ కేసు నమోదు చేసింది. దీనితో తీగలాగితే డొంక కదిలినట్టయ్యింది. ఆ తర్వాత కూడా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకునే,శ్రద్ధాకపూర్‌ వంటి వారిని ఎన్.సీ.బీ. అధికారులు విచారణ కోసం పిలిచారు. అలానే హాస్యనటి భారతీ సింగ్, ఆమె భర్త కూడా డ్రగ్స్ బురదను అంటించుకున్నారు. తన పేరును ఈ వివాదంలోకి అనవసరంగా లాగారంటూ రకుల్ ప్రీత్ కోర్టుకెక్కి... చివరకు విజయం సాధించింది. చిత్రం ఏమంటే... బాలీవుడ్ తో పాటు ఇటు శాండిల్ వుడ్ ను డ్రగ్స్ వివాదం కుదిపేసింది. నటి రాగిణీ ద్వివేది, ఆమె భర్త రవి, నటి సంజనా గల్రానీ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపించారు. కరోనా బారిన పడిన తనను 'వదినమ్మ' సీరియల్‌ దర్శక నిర్మాతలు పట్టించుకోలేదంటూ సీనియర్‌ నటి శివపార్వతి వాపోయారు. గత యేడాది జనవరి 3న ప్రేమ వివాహం చేసుకున్న సింగర్ నోయల్‌, నటి ఏస్తేర్ కు ఆగస్ట్ 31న విడాకులు మంజూరు అయ్యాయి. సెప్టెంబర్ 9న నటి కంగనా రనౌత్ కార్యాలయం అక్రమ నిర్మాణమని పేర్కొంటూ బీఎంసీ అధికారులు పాక్షికంగా కూల్చేశారు. కొంతకాలంగా కంగనా, మహారాష్ర్ట ప్రభుత్వాల నడుమ సాగుతున్న కోల్డ్ వార్ ఈ చర్యతో మరింత వేడెక్కింది. 'ప్రయాణం' ఫేమ్ పాయల్ ఘోష్ సైతం బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై కాస్టింగ్ కౌచ్ విషయమై తీవ్ర ఆరోపణలు చేసింది. దాంతో పరస్పరం పోలీసు కేసులూ పెట్టుకున్నారు. ఆ రకంగా ఈ యేడాది అత్యధికంగా బాలీవుడ్ రకరకాల వివాదాల కారణంగా వార్తల్లో విపరీతంగా నానింది.

కన్ను తెరిస్తే జననం... కన్నుమూస్తే మరణం. ఈ జీవిత సత్యం అందరికీ తెలుసు. కానీ చిన్నపాటి కుదుపును కూడా తట్టుకోలేనంత సున్నితంగా సినీజనం తయారయ్యారు. దాంతో ఈ యేడాది అనేకమంది క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం.

ఆ యేడాది చిత్రసీమలో ఆత్మహత్య చేసుకున్న వారి లిస్ట్ చూస్తే బాధతో పాటు ఆశ్యర్యమూ కలుగుతుంది. సజావుగా సాగుతున్న కెరీర్ ను వ్యక్తిగత బలహీనతలతో కొందరు పాడు చేసి, ఆపైన డిప్రషన్ కు గురై సూసైడ్ చేసుకున్నారు. ఇందులో అందరినీ కలచి వేసిన ఘటన జూన్ 14న జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్ పుత్ ముంబైలోని తన అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ లోని నెపోటిజమ్ పై దేశ వ్యాప్తంగా వివిధ మాధ్యమాలలో అంతులేని చర్చ జరిగింది. చివరకు ఈ విషాద ఘటన డ్రగ్స్ కోణాన్నీ వెలికి తీసింది. నిజానికి జనవరి 24వ తేదీ నుండే ఆత్మహత్యల పరంపర మొదలైంది. 'దిల్ తో హ్యాపీ హై జీ' షో తో పాపులారిటీ పొందిన సేజల్ శర్మ తన ఇంటిలో ఆత్మహత్య చేసుకుంది. ఏప్రిల్ 9వ తేదీన బుల్లితెర నటి విశ్వశాంతి అనుమానాస్పద మృతి చెందింది. పలు హిందీ టీవీ కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న మన్ మీత్ గ్రేవాల్ మే 15వ తేదీ నవీ ముంబైలోని తన నివాసంలో సూసైడ్ చేసుకున్నాడు. ఇదే నెల 25న టీవీ నటి ప్రేక్ష మెహతా ఇండోర్ లో ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత మూడు రోజులకే ఇటు బెంగళూరులో కన్నడ నటి చందన విషం తాగి చనిపోయింది. 'క్యోంకీ సాస్ భీ కభీ బహూథీ, లెఫ్ట్ రైట్‌ లెఫ్ట్' సీరియల్స్ ఫేమ్ సమీర్ శర్మ ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడు. సెప్టెంబర్ 9వ తేదీ 'మనసు మమత', 'మౌనరాగం' సీరియల్స్ లో కీలక పాత్రను పోషించిన నటి శ్రావణి సుసైడ్ చేసుకుంది. పలు హిందీ చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన నటుడు ఆసిఫ్‌ బాస్రా హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనటి, వీజే చిత్ర సైతం 28 సంవత్సరాల వయసులోనే హోటల్ గదిలో సూసైడ్ చేసుకుంది. మొత్తంగా ఈ సారి బుల్లితెర నటీనటులు ఎక్కువమంది బలవన్మరణానికి పాల్పడ్డారు.

కరోనా కనిపించకుండా చాలా మంది సినీ ప్రముఖులను చావుదెబ్బ కొట్టింది. కోవిడ్ 19తో కొందరు హఠాన్మరణానికి గురైతే, కొందరు చికిత్స తీసుకుంటూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు... ఈ యేడాది అలా తనువు చాలించిన వారిలో సంగీత శాఖకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. పలువురు సింగర్స్, లిరిక్ రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక శలవంటూ చిత్రసీమను వదిలి వెళ్ళిపోయారు. జనవరి మాసంలో ప్రముఖ రచయిత ఆదివిష్ణు, 'పంతులమ్మ'కు మాటలు రాసిన ఆకాశవాణి విశ్రాంత ఉద్యోగి దివి వెంకట్రామయ్య, 'మను, ఫలక్ నుమా దాస్'లో కీలక పాత్రలు పోషించిన జాన్ కొట్టాలీ చనిపోయారు. ఫిబ్రవరి మాసంలో సీనియర్ పాత్రికేయులు, బహు గ్రంథ కర్త పసుపులేటి రామారావు, చిరంజీవి తొలి చిత్రం 'పునాదిరాళ్ళు' ను తెరకెక్కంచిన గూడపాటి రాజ్ కుమార్ అనారోగ్యంతో చనిపోయారు.

తెలుగు సినిమా రంగంలో కథాబలం ఉన్న 'పవిత్రబంధం, పెళ్ళి చేసుకుందాం' వంటి విజయవంతమైన చిత్రాలనెన్నింటినో నిర్మించిన నిర్మాతలలో ఒకరైన చామర్తి వెంకట్రాజు మార్చి 8న కన్నుమూశారు. అదే నెల 17న ప్రముఖ నటుడు అంజాద్ ఖాన్ సోదరుడు, నటుడు ఇంతియాజ్ ఖాన్ చనిపోయారు. దర్శక నటుడు విసు సైతం అనారోగ్యంతో మార్చి 22న చెన్నైలో మృతి చెందారు. రాజ్ కపూర్ 'బర్సాత్' మూవీతో నటిగా వెండితెరకు పరిచయమైన నిమ్మి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచారు. దర్శకుడు సుకుమార్ సన్నిహితుడు, 'అమరం అఖిలం ప్రేమ' నిర్మాత ప్రసాద్ గుండెపోటుతో చనిపోయారు. ఏప్రిల్ మాసం కూడా చాలా మంది సినీ ప్రముఖులను దూరం చేసింది. దేవదాసు కనకాల కుమార్తె, నటి శ్రీలక్ష్మి కాన్సర్ తో చనిపోగా, సీనియర్‌ నటుడు సి.ఎస్. రావు అనారోగ్యంతో కన్నుమూశారు. తొలితరం సెలబ్రిటీ జర్నలిస్ట్ గల్షన్ యులింగ్ కరోనా కారణంగా లండన్ లో చనిపోయారు. బాలీవుడ్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో తనువు చాలించారు. 'పాన్ సింగ్ తోమార్'తో జాతీయ ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్ ఖాన్ అవార్డు పొందారు. ఇదే నెల 30వ తేదీ ప్రముఖ నటుడు రిషికపూర్ చనిపోయారు. '1973'లో 'బాబీ' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ కుమార్ తనయుడు రిషి... చివరి వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

మిమిక్రీ కళాకారుడు, నటుడు హరికిషన్‌ మే 23న గుండెపోటుతో కన్నుమూశారు. అదే నెలలో బాలీవుడ్ యువ నటుడు మోహిత్ బాగెల్‌, సీనియర్ లిరిక్ రైటర్ యోగేశ్ గౌర్ చనిపోయారు. జూన్ మాసం కూడా ప్రముఖ దర్శకులు, సంగీత కళాకారులను దూరం చేసింది. జూన్ 1వ తేదీన సంగీత దర్శకద్వయం సాజిద్ - వాజిద్ లోని వాజిద్ కరోనాతో కన్నుమూశారు. ఆ తర్వాత రెండు రోజులకే గీత రచయిత అన్వర్ సాగర్ చనిపోయారు. ఇక 'రజనీగంథ, చోటీసీ బాత్, చిచ్చోర్' చిత్రాల దర్శకుడు బసు ఛటర్జీ అనారోగ్యంతో తనువు చాలించారు. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా 39 యేళ్ళ వయసులో గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యాడు. ఇదే నెలలో జూనియర్‌ ఆర్టిస్ట్ హరీశ్ గౌడ్, అనువాద చిత్రాల నిర్మాత, ఎడిటర్ గబ్బిట మధు, పబ్లిసిటీ డిజైనర్ ముగడ భాస్కర్, తమిళ యువ దర్శకుడు బాలమిత్రన్ చనిపోయారు. తమిళ సినీ దిగ్గజం భీమ్ సింగ్ తనయుడు, ప్రముఖ ఛాయాగ్రాహకుడు బి. కణ్ణన్ చెన్నైలో కన్నుమూశారు. తెలుగు గీత రచయిత రాచపల్లి ప్రభు, మలయాళ సినీ రచయిత, దర్శకుడు, 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఫేమ్ సచి అనారోగ్యంతో తుదిశ్వాస వదిలారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ను సైతం చిత్రసీమ ఈ యేడాది కోల్పోయింది. నాలుగు దశాబ్దాల కాలంలో రెండు వేలకు పైగా పాటలకు ఆమె నృత్యరీతులు సమకూర్చారు. మూడు జాతీయ అవార్డులతో పాటు నంది పురస్కారాన్ని సరోజ్ ఖాన్ పొందారు. ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మితమైన చిత్రాలకు సమర్పకులుగా వ్యవహరించిన పోకూరి రామారావు కరోనాతో కన్నుమూశారు. బాలీవుడ్ నిర్మాత హరీష్‌ షా, నటి దివ్యా చౌక్సీ క్యాన్సర్ తోనూ, ప్రముఖ హాస్యనటుడు జగ్ దీప్, నటీమణి కుమ్ కుమ్ వయోభారంతోనూ, సీనియర్ తెలుగు ప్రొడ్యూసర్ కిలారు ముఖర్జీ అనారోగ్యంతోనూ, బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ కిడ్నీ సంబంధిత వ్యాధితోనూ ఇదే నెలలో కన్నుమూశారు. నటుడు మంచాల సూర్యనారాయణ, నిర్మాత కందేపి సత్యనారాయణ, ప్రముఖ నటుడు, పాత్రికేయుడు, నాటకకర్త రావి కొండలరావు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

ఆగస్ట్ మాసం ఆరంభం అవుతూనే ప్రజా వాగ్గేయ కారుడు వంగపండు ప్రసాదరావును తీసుకెళ్ళిపోయింది. అలానే సీనియర్ దర్శకుడు ఎన్. బి. చక్రవర్తి, కవి, గీత రచయిత రాహత్, ప్రముఖ దర్శకుడు నిషికాంత్‌ కామత్, పండిట్ జశ్ రాజ్, పంపిణీదారుడు గూండాల కమలాకర్ రెడ్డి, తమిళ, సింహళ దర్శకుడు ఎ.బీ. రాజ్, నవయుగ ఫిలిమ్స్ కు చెందిన కాట్రగడ్డ నరసయ్య ఇదే నెలలో చనిపోయారు. సెప్టెంబర్ మాసం తెలుగు సినిమాకు చేసిన ద్రోహం ఇంతా అంతా కాదు... ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, వ్యాఖ్యాత, నిర్మాత కోట్లాదిమంది గుండెల్లో పాటగా కొలువైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25న కన్నుమూశారు. సీనియర్ సంగీత దర్శకుడు ఎస్. మొహిందర్, నటుడు, 'లవకుశ'లో లవుడు పాత్రధారి నాగరాజు, సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి సైతం చిత్రసీమకు వీడ్కోలు పలికి వెళ్ళిపోయారు. 'శ్రీసాయి మహిమ' చిత్రానికి పిన్నవయసులోనే స్వరాలు అందించిన అనురాధా ఫౌడ్వాల్ కుమారుడు ఆదిత్య, తమిళ నటుడు ప్లోరెంట్ ఫెరీరా, ప్రముఖ నటుడు నాగభూషణం సతీమణి, నటి 'రక్తకన్నీరు' సీత, అలనాటి హిందీ నటి ఆశాలత, నటుడు భూపేష్‌ కుమార్ పాండ్య, తెలుగు హాస్యనటుడు వేణుగోపాల్‌, హిందీ గీత రచయిత అభిలాష్‌ కన్నుమూశారు.

అక్టోబర్ 4న దేవానంద్ మేనల్లుడు, నట దర్శకుడు విశాల్ ఆనంద్ కన్నుమూశారు. ఇదే నెలలో యాభైకు పైగా కన్నడ, తెలుగు, హిందీ చిత్రాలను తెరకెక్కించిన విజయారెడ్డి బెంగళూరులో చనిపోయారు. ఇక ప్రముఖ సంగీత ద్వయం రాజన్ - నాగేంద్రలోని అన్న రాజన్ వయోభారంతో కన్నుమూశారు. దాదాపు 370 కన్నడ, 60 తెలుగు సినిమాలకు తన తమ్ముడు నాగేంద్రతో కలిసి రాజన్ స్వరరచన చేశారు. 91 సంవత్సరాల వయసులో భారతదేశపు మొట్టమొదటి ఆస్కార్ విజేత, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అద్థయ్య కన్నుమూశారు. 'లేకిన్, లాగాన్' చిత్రాలకు ఆమె జాతీయ స్థాయిలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా అవార్డులు అందుకున్నారు. పలు చిత్రాల నిర్మాణ నిర్వాహకులు కొండపల్లి రామకృష్ణ ప్రసాద్ నవంబర్ 3న చనిపోయారు. అదే నెలలో సీనియర్ ఎడిటర్ కోలా భాస్కర్ ను, హిందీ నటుడు ఫరాజ్ ఖాన్ ను, సీనియర్ రచయత జీడిగుంట రామచంద్రమూర్తిని, రంగస్థల ప్రముఖులు ఏడిద గోపాలరావును, దాదాసాహెబ్ అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు సౌమిత్ర ఛటర్జీనీ సినీ రంగం కోల్పోయింది. డిసెంబర్ మాసంలో తెలుగు నటుడు యాదాకృష్ణ, జాతీయ స్థాయిలో బెస్ట్ కాస్ట్యూమర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా మొత్తం ఐదు సార్లు అవార్డులు గెలుచుకున్న మలయాళ కళాదర్శకుడు పి. కృష్ణమూర్తి కన్నుమూశారు. ఈ యేడాది హాలీవుడ్ నటులూ పలువురు వయోభారంతోనూ, కరోనాతోనూ చనిపోయారు. మరీ ముఖ్యంగా తొలి జేమ్స్ బాండ్ షాన్ కానరీ చనిపోవడం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచివేసింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: ntvtelugu
Top