Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sunetra Pawar: బారామతి చరిత్రలో సరికొత్త అధ్యాయం.. భర్త మెజార్టీని క్రాస్ చేసిన సునేత్రా పవార్!

Sunetra Pawar: బారామతి చరిత్రలో సరికొత్త అధ్యాయం.. భర్త మెజార్టీని క్రాస్ చేసిన సునేత్రా పవార్!

NTV Telugu 2 weeks ago

Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతి అసెంబ్లీ స్థానం మరోసారి చరిత్ర సృష్టించింది. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, దివంగత అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి, ఎన్సీసీ అభ్యర్థి సునేత్రా పవార్ కళ్లు చెదిరే రీతిలో భారీ మెజారిటీతో విజయం సాధించారు.

రికార్డులన్నీ బద్దలు.. ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు!
బారామతి అసెంబ్లీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా సునేత్రా పవార్‌కు ఏకపక్షంగా ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆమెకు సుమారు 2.19 లక్షల ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి కనీసం 1,000 ఓట్లు కూడా దాటలేదు. బరిలో నిలిచిన రెండు డజన్ల మంది స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి కేవలం 5,000 ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం. 2024లో అజిత్ పవార్ సాధించిన లక్ష ఓట్ల మెజారిటీ రికార్డును సునేత్రా పవార్ ఈ విజయంతో క్రాస్ చేశారు. నిజానికి అజిత్ పవార్ ఆకస్మిక మరణం బారామతి ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనపై ఉన్న గౌరవంతో ప్రధాన రాజకీయ పార్టీలేవీ సునేత్రా పవార్‌కు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టలేదు. కేవలం స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారు. అజిత్ పవార్ పట్ల ఉన్న భావోద్వేగ బంధం, సానుభూతి పవనాలతో పాటు సునేత్రా పవార్ క్షేత్రస్థాయిలో చేసిన ప్రచారం ఆమెకు ఈ భారీ విజయాన్ని కట్టబెట్టాయి.

6 దశాబ్దాల పవార్ కోట..
1967 నుంచి బారామతి అంటే పవార్ కుటుంబమే అనేలా ఇక్కడి రాజకీయాలు సాగుతున్నాయి. తొలుత శరద్ పవార్, ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాల పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. ఇప్పుడు అదే వారసత్వాన్ని సునేత్రా పవార్ ముందుకు కొనసాగించబోతున్నారు. విజయం అనంతరం సునేత్రా పవార్ భావోద్వేగానికి లోనయ్యారు. “ఈ విజయం బారామతి ప్రజలది. అజిత్ పవార్ నెరవేర్చని కలలను నేను పూర్తి చేస్తాను. ఆయన ఆశయాలకు అనుగుణంగా బారామతి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను” అని ఆమె ప్రకటించారు. ఈ విజయంతో బారామతి వ్యాప్తంగా ఎన్సీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ పండుగ చేసుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu