Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు

NTV Telugu 5 days ago

ల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సమర్పించిన క్షమాపణను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.

ఈ కేసులో తదుపరి చర్యలను నిర్ణయించే ముందు.. మంత్రిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై మధ్యప్రదేశ్ గవర్నర్ నిర్ణయం కోసం వేచి చూడాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

అనుచిత వ్యాఖ్యలు

గతేడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి విజయ్ షా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను "ఉగ్రవాదుల సోదరి"గా అభివర్ణించారు. ఉగ్రవాదుల మతానికి చెందిన ఆమెనే.. శత్రువులపైకి మోడీ పంపించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ చేపట్టే అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసును సోమవారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారించింది. మంత్రిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు గతంలోనే కోరింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్ వాదనలు వినిపిస్తూ.. ప్రాసిక్యూషన్ అనుమతిపై గవర్నర్ ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు.

మరోవైపు విజయ్ షా తరఫున సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ వాదిస్తూ.. మంత్రి ఇప్పటికే తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసి క్షమాపణ చెప్పారని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ.. ఈ విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని సూచించారు.

SIT దర్యాప్తు పూర్తి

ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించిందని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. గవర్నర్ నిర్ణయం తర్వాత తదుపరి చర్యలు ఏమిటనే దానిపై కూడా ఆయన స్పష్టత కోరారు. ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇస్తే ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తారా? అని సీజేఐ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అనుమతి లభిస్తే ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని ఏఎస్జీ నటరాజ్ తెలిపారు. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. దీంతో ప్రాసిక్యూషన్ అనుమతిపై గవర్నర్ నిర్ణయం వెలువడే వరకు వేచి ఉండాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu