Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Suriya Veerabhadrudu Review: సూర్య 'వీరభద్రుడు' మూవీ రివ్యూ:

Suriya Veerabhadrudu Review: సూర్య 'వీరభద్రుడు' మూవీ రివ్యూ:

NTV Telugu 1 week ago

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా ఫాంటసీ కోర్ట్ రూమ్ డ్రామా ‘కరుప్పు’, ఈ సినిమాను తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదల చేశారు.

విడుదలకు ముందు కొన్ని ఆర్థికపరమైన చిక్కుల కారణంగా ఒకరోజు ఆలస్యంగా మే 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించడంతో పాటు మెయిన్ విలన్ గా నటించిన ఈ చిత్రంలో, త్రిష ఒక కీలక పాత్ర పోషించారు. భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టిన ‘వీరభద్రుడు’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో ఇప్పుడు చూద్దాం.

వీరభద్రుడు కథ:
నాంపల్లి కోర్టులో లాయర్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) దే రాజ్యం. డబ్బుతో ఏమైనా సాధించవచ్చనే అహంకారంతో, జడ్జి (నట్టి సుబ్రమణియన్)ని సైతం మ్యానేజ్ చేస్తూ తన క్లయింట్లకు అనుకూలంగా తీర్పులు ఇప్పించుకుంటాడు. మరోవైపు, మునిస్వామి నాయుడు (ఇంద్రాన్స్) తన కూతురు మీను (అనఘా రవి) లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 60 సవర్ల బంగారంతో చెన్నై నుంచి వస్తుండగా, నాంపల్లి వద్ద ఆ బంగారం దొంగల పాలవుతుంది. అందులో కొంత భాగం రికవరీ అయినప్పటికీ, ఆ బంగారాన్ని ఇప్పిస్తానని చెప్పి లాయర్ బేబీ కృష్ణ.. నాయుడు దగ్గర ఉన్న డబ్బును కూడా లాగేసుకుంటాడు. న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయిన నాయుడు, కోర్టు ఆవరణలో కొలువై ఉన్న క్షేత్రపాలకుడు వీరభద్రుడిని (సూర్య) శరణు కోరుతాడు. భక్తుడి మొర ఆలకించిన దేవుడు లాయర్ అవతారంలో కోర్టులో అడుగుపెడతాడు. దేవుడికే ఎదురెళ్లిన బేబీ కృష్ణ.. “నీ శక్తులు వాడకుండా ఈ కేసు గెలిచి చూపించు” అని సవాల్ విసురుతాడు. ఆ సవాల్‌ను వీరభద్రుడు ఎలా స్వీకరించాడు? మీను మరణం కథలో ఎలాంటి మలుపులు తెచ్చింది? అహంకారి అయిన లాయర్‌కు దేవుడు ఎలా బుద్ధి చెప్పాడు? అన్నదే కథ.

విశ్లేషణ: ‘వీరభద్రుడు’ సినిమా విషయానికి వస్తే కనుక దేవుడు వచ్చినా న్యాయవ్యవస్థను మార్చలేడని ఆర్జే బాలాజీ చెప్పాలనుకున్నా కోర్టు ప్రొసీడింగ్స్ మీద రాసుకున్న సెటైర్స్ పేలలేదు. న్యాయం జరగడంలో అయ్యే ఆలస్యం, ఆ క్రమంలో ఒక సామాన్యుడిని ఈ వ్యవస్థ ఎలా పీల్చి పిప్పిచేస్తుంది అనే పాయింట్ చుట్టూ డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఈ కథను అద్భుతంగా అల్లాడు. అవినీతిని ఏదో పైపైన చూపించకుండా, సామాన్యుడి కన్నీటికి దానికి ముడిపెట్టి కథనాన్ని నడిపించిన తీరు ఆలోచింపజేస్తుంది. ‘న్యాయం ఆలస్యమైతే.. అది అన్యాయం కిందే లెక్క’ అనే పాయింట్‌ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బ్రిలియంట్‌. సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా పండింది. ఫాంటసీ ఎలిమెంట్స్ మొదలవ్వడానికి ముందే.. తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే ఎపిసోడ్‌తో ఆడియన్స్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. సామాన్యుడి నిస్సహాయతను ప్రేక్షకులకు కనెక్ట్ చేసిన విధానం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. కమర్షియల్ మాస్ మూమెంట్స్‌ను, సోషల్ మెసేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ రాసుకున్న స్క్రీన్‌ప్లే సినిమాకు హైలైట్. అయితే, సెకండాఫ్‌లో ఫాంటసీ ఎలిమెంట్స్ కాస్త శృతి మించినట్లు అనిపిస్తాయి. ఎమోషన్ కంటే మాస్ మూమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల స్టోరీ టెల్లింగ్ స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికీ, మొదటి సగంలో చేసిన ఎమోషనల్ సెటప్ స్ట్రాంగ్‌గా ఉండటం వల్ల ఆడియన్స్ కథలో లీనమైపోతారు. కోర్టు రూమ్ డ్రామాలో వచ్చే పొలిటికల్ సెటైర్లు, సమాజంపై ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ పేలే డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయి. ఆర్జే బాలాజీ రైటింగ్‌లో కమర్షియల్ మీటర్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది.

నటీనటుల విషయానికి వస్తే సూర్య ఈ సినిమాకు ప్రాణం పోశాడు. క్షేత్రపాలకుడిగా, లాయర్‌గా ఆయన చూపించిన వేరియేషన్స్ అద్భుతం. ముఖ్యంగా రుద్రతాండవం చేసే సన్నివేశాల్లో ఆయన నటనకు థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. కాసేపు ‘సింగమ్’ తరహాలో పవర్ ఫుల్ గా కనిపిస్తూనే, క్లైమాక్స్‌లో నటవిశ్వరూపం చూపించాడు. ఆర్జే బాలాజీ నటుడిగా తన పరిధి మేర బాగానే చేసినప్పటికీ, సూర్య లాంటి స్టార్ హీరో ముందు విలన్‌గా తేలిపోయాడు. సూర్య ఇమేజ్‌ను ఢీకొట్టే స్థాయిలో ఆ పాత్ర పండలేదు. త్రిష రెగ్యులర్ హీరోయిన్ పాత్రలో కాకుండా ఒక ముఖ్యమైన రోల్ లో కనిపించి మెప్పించింది. తండ్రీకూతుళ్లుగా ఇంద్రాన్స్, అనఘా రవి తమ ఎమోషనల్ నటనతో కంటతడి పెట్టిస్తారు. జార్జ్ మరియమ్, నట్టి సుబ్రమణియన్ తమ పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక వర్గం విషయానికి వస్తే దర్శకుడిగా ఆర్జే బాలాజీ ఒక మంచి కమర్షియల్ ఫాంటసీ కథను ఎంచుకున్నాడు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డాడు. సినిమా మొదలైన 40 నిమిషాల వరకు హీరో ఎంట్రీ ఉండదు, తన పాత్రకు తానే ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చుకోవడం కాస్త విసుగు తెప్పిస్తుంది. సూర్య ఎంట్రీ తర్వాతే సినిమా ట్రాక్ ఎక్కుతుంది. ఇక సాయి అభ్యంకర్ అందించిన పాటలు తెలుగు డబ్బింగ్ లోపం వల్ల పెద్దగా రిజిస్టర్ అవ్వకపోయినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. సూర్య తెరపైకి వచ్చిన ప్రతిసారీ తన బీజీఎమ్‌తో సీన్‌ను ఎలివేట్ చేశాడు. జీకే విష్ణు కెమెరా పనితనం విజువల్స్ కు రిచ్ నెస్ తెచ్చింది. ఎడిటర్ ఆర్ కలైవణ్ణన్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే, రెండున్నర గంటల నిడివి సాగదీసిన భావన కలిగేది కాదు. ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడలేదని ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది.

ఫైనల్లీ :’వీరభద్రుడు’ సూర్య అభిమానులకు ఒక పండుగ లాంటి సినిమా. అంచనాలు లేకుండా వెళితే, ‘వీరభద్రుడు’ మెప్పిస్తాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu