Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!

Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!

NTV Telugu 1 week ago

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. జూన్ 2, 2014న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ తమ సందేశాల ద్వారా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు దిశపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాలు, వేలాది మంది ప్రజల పోరాట స్ఫూర్తి, అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలంగాణ వాసులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అమరవీరుల ఆశయాలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న సీఎం, వారి త్యాగాలకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా కీలక అడుగులు వేస్తున్నామని సీఎం తెలిపారు. రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని, పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

పదేళ్లలో తెలంగాణ దేశానికే దిక్సూచి: కేసీఆర్
మరోవైపు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు కూడా రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల పాటు కొనసాగిన వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సాగిన ఉద్యమం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ, స్వయం పాలనలో కేవలం పదేళ్లలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో సాధించిన పురోగతి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకున్న ప్రగతి, అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పాలకులు చిత్తశుద్ధితో అమలు చేయాలని, ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని విస్మరించరాదని హితవు పలికారు. తెలంగాణ నిరంతరం పచ్చని పంట పొలాలతో, సుభిక్షతతో, సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఆయన తన సందేశాన్ని ముగించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu