Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..

NTV Telugu 5 days ago

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలలో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు 34 సంవత్సరాలుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీసుల నియమావళి ప్రకారం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు విడుదల చేసే ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్లకు వర్తించనుంది. ఈ వయోపరిమితి సడలింపు ఒక సంవత్సరం పాటు అమల్లో ఉండనుంది.

ఈ నిర్ణయంతో లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే అవకాశం లభించనుంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యంగా రావడం వల్ల వయోపరిమితి దాటిపోయిన అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-1 సహా పలు కీలక ఉద్యోగ నియామకాల ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. దాదాపు పదేళ్ల పాటు అనేక శాఖల్లో సరైన స్థాయిలో నియామకాలు జరగకపోవడంతో అప్పట్లో ప్రభుత్వం వయోపరిమితిని సడలించింది. ఆ ఉత్తర్వుల గడువు ఇటీవల ముగియడంతో మరోసారి ప్రభుత్వం ఈ అంశంపై సమీక్ష నిర్వహించి తాజా నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉండగా, తాజా సడలింపుతో ఇప్పుడు 44 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న అభ్యర్థులు కూడా అర్హత పరీక్షలు రాసే అవకాశం పొందనున్నారు. దీని ద్వారా చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొత్త ఆశలు కలిగాయి. కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ముందు అభ్యర్థుల వయోపరిమితిపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పలు శాఖల్లో భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu