Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!

Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!

NTV Telugu 1 week ago

Telangana Rainfall Deficit: తెలంగాణలో ఈ ఏడాది వర్షాకాలం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 20 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి.

జూన్ నుంచి ఆగస్టు వరకు మూడు నెలల్లో సాధారణంగా 581 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 462 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో వర్షాల లోటు ఆందోళన కలిగిస్తోంది. నెలల వారీగా చూస్తే.. జూన్‌లో సాధారణం కంటే 8 శాతం, జూలైలో 10 శాతం వర్షపాతం లోటు నమోదైంది. అయితే ఆగస్టులో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఆ నెలలో ఏకంగా 42 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో సాగు, తాగునీరు, భూగర్భ జలాలపై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలోని జిల్లాల వారీ పరిస్థితిని పరిశీలిస్తే.. కేవలం 13 జిల్లాల్లో సాధారణ స్థాయి వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. మరో 19 జిల్లాల్లో తీవ్ర వర్షపాతం లోటు ఉన్నట్లు వెల్లడించారు. అయితే కామారెడ్డి జిల్లాలో మాత్రం సాధారణం కంటే 25 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని తెలిపారు. వర్షాకాలంలో చివరి నెల అయిన సెప్టెంబర్‌పైనే ఇప్పుడు రైతులు, ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అయితే సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని వాతావరణ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 శాతం వరకు వర్షపాతం లోటు నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.

మరోవైపు వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా సెప్టెంబర్‌లో ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరగవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో సెప్టెంబర్‌లో వాతావరణం ఎండాకాలాన్ని తలపించే పరిస్థితులు కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటడం, ఎల్‌ నినో ప్రభావం తీవ్రతరం కావడం వంటి పరిణామాలు వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పెద్దగా వర్షాలు కురిసే అవకాశాలు తగ్గుతాయని అంచనా. అయితే బంగాళాఖాతంలో లో ప్రెషర్ లేదా ఇతర వాతావరణ వ్యవస్థలు ఏర్పడితేనే తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్‌లో వర్షాల పరిస్థితి ఎలా ఉంటుందనేది రానున్న రోజుల్లో ఏర్పడే వాతావరణ వ్యవస్థలపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu