ఏఐ దూకుడికి కళ్లెం వేయాలని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలను అధ్యక్షుడు ట్రంప్ తిప్పికొట్టారు. ఏఐ వేగాన్ని తగ్గిస్తే టెక్నాలజీ పోటీలో చైనాకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
ఏఐకి మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆంత్రోపిక్ సీఈవో డారియో వాదనను తోసిపుచ్చుతూ.. ఈ సాంకేతికతకు అవసరమైన ఏకైక రక్షణ అందించేది కేవలం బలమైన, తెలివైన అధ్యక్షుడు మాత్రమే అందిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.
"ఏఐకి అవసరమైన ఏకైక నియంత్రణ లేదా 'గార్డ్‌రైల్స్' బలమైన, తెలివైన (హై ఐక్యూ!) అధ్యక్షుడు. అమెరికాకు అది పుష్కలంగా ఉంది!" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఏఐ, డేటా సెంటర్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని "అనారోగ్యకరమైన కుట్ర"గా అభివర్ణించారు. ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేసే ప్రయత్నాలు చైనాకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని అన్నారు. "ఎవరైతే ఏఐని గెలుచుకుంటారో.. వాళ్లే గెలుస్తారు!" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రస్తుతం చైనాతో పాటు ఇతర దేశాల కంటే ముందంజలో ఉందని.. ఈ ఆధిపత్యాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
ట్రంప్ విమర్శలు
ఏఐ అభివృద్ధిపై నియంత్రణలు, జాగ్రత్తలు అవసరమన్న వాదన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు వచ్చాయి. ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ.. ఏఐతో ఎదురయ్యే ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కంపెనీలు ఏఐ అభివృద్ధిని కొంత నెమ్మదించాలని ఇటీవల పిలుపునిచ్చారు. తాజాగా దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఏఐ కంపెనీలు "చెడు లేదా సంభావ్యంగా చెడు" పనులు చేయకుండా తన ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని అన్నారు. ఏఐ సంస్థలపై క్రిమినల్, నియంత్రణపరమైన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి విస్తృతంగా ఉందని పేర్కొన్నారు. అమోడీని ఉద్దేశించి ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తాను "పరిపూర్ణమైన చిన్న దేవదూతలా నటిస్తున్న వ్యక్తి" అని అమోడీని అభివర్ణించారు. ఏదైనా సంస్థ తప్పుగా వ్యవహరిస్తోందని భావిస్తే తమ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కొనసాగిస్తుందని తెలిపారు.
నియంత్రణలు అవసరమా?
ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందాలి? దాని వల్ల తలెత్తే ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఎలాంటి భద్రతా చర్యలు ఉండాలి? అనే అంశాలపై టెక్నాలజీ రంగ నిపుణులు, ప్రభుత్వాలు, విధాన నిర్ణేతల మధ్య చర్చ కొనసాగుతోంది. ఏఐ అభివృద్ధిని కొంత నెమ్మదించాలని అమోడీ కోరుతుండగా.. టెక్నాలజీ రంగంలోని పలువురు ప్రముఖులు కూడా ఏఐ భద్రత, చట్టపరమైన బాధ్యత, జాతీయ భద్రతకు సంబంధించి మరింత కఠినమైన చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. మరింత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్న కొద్దీ వాటి దుర్వినియోగం, సైబర్ భద్రత, దీర్ఘకాలిక ప్రమాదాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
పోటీని ప్రస్తావించిన ట్రంప్
ఏఐపై అదనపు నియంత్రణలు అమెరికా టెక్నాలజీ రంగం వేగాన్ని తగ్గించవచ్చన్న అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. ఏఐ అభివృద్ధిని అడ్డుకోవడం వల్ల అమెరికా వెనుకబడే అవకాశం ఉందని, అదే సమయంలో చైనాకు ప్రయోజనం కలుగుతుందని వాదించారు. ప్రపంచంలో సాంకేతిక ఆధిపత్యం కోసం అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న పోటీలో ఏఐ కీలకంగా మారిందని ట్రంప్ పేర్కొన్నారు. "ఏఐ రేసులో ఎవరు గెలిస్తే.. వారిదే ఆధిపత్యం" అనే తన వైఖరిని మరోసారి స్పష్టం చేస్తూ, ఏఐలో అమెరికా ఆధిక్యాన్ని కొనసాగించడమే తమ లక్ష్యమని ట్రంప్ సంకేతాలిచ్చారు.


