Dailyhunt
TVK Super Hit : తమిళ రాజకీయాల్లో పెను సంచలనం.. విజయ్ 'టీవీకే' సూపర్ హిట్..!

TVK Super Hit : తమిళ రాజకీయాల్లో పెను సంచలనం.. విజయ్ 'టీవీకే' సూపర్ హిట్..!

NTV Telugu 1 week ago

TVK Super Hit : తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ప్రధాన ద్రవిడ పార్టీలకు షాక్ ఇస్తూ, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టించింది.

ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం, విజయ్ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సాధించిన పార్టీగా అవతరించి అగ్రస్థానంలో నిలిచింది.

సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, అనతి కాలంలోనే ప్రజల మద్దతును భారీగా కూడగట్టుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఏకంగా కోటి 28 లక్షల ఓట్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏ పార్టీ తోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి ఇంతటి భారీ స్థాయిలో ఓట్లు సాధించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయ్ చరిష్మా , ఆయన పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే (DMK) కూటమి ఈ సారి రెండో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. డీఎంకే కూటమి మొత్తానికి కోటి 17 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో డీఎంకే పార్టీ ఒంటరిగా 83 లక్షల ఓట్లను సాధించింది. అధికారంలో ఉండి కూడా విజయ్ పార్టీ కంటే తక్కువ ఓట్లు సాధించడం డీఎంకే శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. బలమైన క్యాడర్ , ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పటికీ, కొత్తగా వచ్చిన టీవీకే పార్టీని అడ్డుకోవడంలో డీఎంకే విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలోని మరో ప్రధాన పార్టీ అయిన అన్నాడీఎంకే (AIADMK) కూటమి మూడో స్థానానికి పడిపోయింది. అన్నాడీఎంకే కూటమికి కేవలం కోటి 8 లక్షల ఓట్లు మాత్రమే లభించాయి. ఇక పార్టీ పరంగా చూస్తే అన్నాడీఎంకే ఒంటరిగా 77 లక్షల ఓట్లను పొందింది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ పార్టీ ఇప్పుడు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావడం గమనార్హం. తమిళనాడులో ఎప్పుడూ ఉండే ద్విధ్రువ రాజకీయాలకు స్వస్తి పలుకుతూ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయంగా, పైగా అగ్రగామి పార్టీగా ఎదిగింది. ఈ మార్పు రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లో మరిన్ని ఆసక్తికర పరిణామాలకు దారితీయనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu