తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద శక్తిగా నిలిచించింది. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 స్థానాల దూరంలోనే ఉంది.
అయితే విజయ్‌కు మద్దతిచ్చేందుకు చిన్న పార్టీలు సన్నద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే చెన్నైలోని టీవీకే కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన తన పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా విజయ్‌ను శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇదిలా ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఎంకే.స్టాలిన్ రాజీనామా చేయగా.. గవర్నర్ ఆమోదించారు. ఇక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు విజయ్ లేఖ రాశారు. లేఖను రాజ్‌భవన్‌కు ఈమెయిల్ ద్వారా పంపించారు. లేఖలో రెండు వారాల్లోగా తమ పార్టీ మెజారిటీని నిరూపించుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం గవర్నర్ చెన్నైలో లేకపోవడంతో రాగానే బుధవారం విజయ్ కలిసే అవకాశాలు ఉన్నాయి.
ఇక విజయ్ రెండు చోట్ల నుంచి విజయం సాధించారు. పెరంబూర్, తిరుచిరాపల్లి తూర్పు నుంచి గెలుపొందారు. పెరంబూర్‌లో 1,20,365 ఓట్ల మెజారిటీతో గెల్వగా.. తిరుచిరాపల్లి తూర్పులో 27,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే పెరంబూర్‌లో ఎక్కువ మెజార్టీ లభించడంతో ఈ సీటును నిలబెట్టుకుని.. మరో సీటును వదులుకోవాలని విజయ్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

